పట్టణ పేదల సొంతింటి కల సాకారం 

2 Jan, 2024 06:02 IST|Sakshi

88 పట్టణ స్థానిక సంస్థల్లో 2.62 లక్షల ఇళ్ల నిర్మాణం

సాక్షి, అమరావతి: పట్టణ పేదల కష్టాలు తీరనున్నాయి. వారి సొంతింటి కల సాకారం కాబోతోంది. ఏపీ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ టిడ్కో) ఆధ్వర్యంలో నిర్మించిన ఇళ్లను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 82,080 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసింది. ఈ నెల 4 నుంచి మరో 73,580 ఇళ్లను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

జనవరి, ఫిబ్రవరి నెలల్లో 61,684 యూనిట్ల పంపిణీకి ముహూర్తం నిర్ణయించారు. గత టీడీపీ ప్రభుత్వం నిరుపేదలపై అధిక ధరలను మోపగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వాటిని తొలగించింది. 1,43,600 మంది నిరుపేదలకు ఉచితంగానే ఫ్లాట్లను కేటాయించింది. మరో 1,18,616 మంది తక్కువ ఆదాయ వర్గాలకు ఆర్థిక భారాన్ని సగానికి తగ్గించి ఇళ్లను అందిస్తోంది.

రాష్ట్రంలోని 88 పట్టణ స్థానిక సంస్థల (యూఎల్బీ) పరిధిలో 163 ప్రాంతాల్లో జీ+3 విధానంలో 2,62,216 టిడ్కో ఇళ్లను నిర్మిస్తుండగా ఇందులో మొదటి దశలో 1,51,298 వంద శాతం నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. కాగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 31 లక్షల మంది పేద మహిళలకు ఇప్పటికే ప్రభుత్వం జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాలు అందజేసిన సంగతి తెలిసిందే. ఈ 31 లక్షల ఇళ్ల స్థలాలు కాకుండా పట్టణ ప్రాంతాల్లో పేదలకు ఇస్తున్న టిడ్కో ఇళ్లు అదనం.

అన్ని మౌలిక వసతులతో లబ్ధిదారులకు..
ఇళ్లకు తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్, రోడ్లు, ఎస్టీపీ వంటి అన్ని మౌలిక వసతులు కల్పించాకే ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తోంది. ప్రస్తుతమున్న నగరాలు, పట్టణాలకు సమీపంలో అనువైన ప్రాంతాల్లో ఉన్న ఈ అపార్ట్‌మెంట్లు సరికొత్త పట్టణాలను తలపిస్తుండటం విశేషం. గుడివాడ, నంద్యాల, కర్నూలు, నెల్లూరు యూఎల్బీల పరిధిలో నిర్మిస్తున్న టిడ్కో ఫ్లాట్లు 10 వేల నుంచి 12 వేల వరకు ఉండడం విశేషం.

ఒక్క నెల్లూరు పరిధిలోనే (అల్లిపురం, వెంకటేశ్వరపురం) రెండు చోట్ల మొత్తం 27 వేల ఇళ్లు నిర్మిస్తున్నారు. గేటెడ్‌ కమ్యూనిటీలను తలపిస్తున్న 163 ప్రాంతాల్లోని నివాసాలకు ‘వైఎస్సార్‌ జగనన్న నగరాలు’గా పేరు పెట్టారు. వీటి నిర్వహణకు నివాసితులతో సంక్షేమ సంఘాలను సైతం ఏర్పాటు చేశారు. 

ఇళ్ల పేరిట పేదలపై చంద్రబాబు బండ
టిడ్కో ప్రాజెక్టులో భాగంగా గత చంద్రబాబు ప్రభుత్వం 3,13,832 ఇళ్ల నిర్మాణం తలపెట్టింది. వీటిలో 2019 మే నాటికి 1,90,944 యూనిట్లు పునాది స్థాయిని మాత్రమే దాటాయి. మరో 1,22,888 యూనిట్లు పునాదుల్లోనే మిగిలిపోయాయి. చ.అడుగు నిర్మాణ వ్యయాన్ని రూ.1,879గా నిర్ణయించడంతోపాటు 63,744 యూనిట్ల నిర్మాణానికి రూ.3,232 కోట్లు వ్యయాన్ని ఖరారు చేశారు.

అయితే, ఇందులో జరిగిన అక్రమాలను గుర్తించిన ప్రస్తుత ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా నిర్మాణ వ్యయాన్ని రూ.2,840 కోట్లకు తగ్గించి రూ.392 కోట్ల ప్రజాధనం ఆదా చేసింది. పేదలు 300 చ.అ. ఇంటికి బాబు ప్రభుత్వం రూ.7.5 లక్షలు భారం మోపి, 20 ఏళ్లపాటు ప్రతినెలా వాయిదాలు కట్టాలని షరతుపెట్టింది. తద్వారా ప్రతి నెలకు రూ.3,805 భారం మోపింది. ఇక 365 చ.అ. ఇంటికి రూ.50 వేలు, 430 చ.అ. ఇంటికి రూ.లక్ష చొప్పున లబ్ధిదారుల వాటా కింద వసూలు చేసింది. 

లబ్ధిదారులకు మేలు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌ 
వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక మూడు కేటగిరీల్లో 2,62,216 టిడ్కో ఇళ్లను ప్రారంభించారు. వీటిలో 300 చ.అ. విస్తీర్ణంలో 1,43,600 యూనిట్లు, 365 చ.అ విస్తీర్ణంలో 44,304 యూనిట్లు, 430 చ.అ విస్తీర్ణంలో 74,312 యూనిట్లు ఉన్నాయి. నిరుపేదలకు కేటాయించిన 300 చ.అ. ఇంటిని రూ.1కే కేటాయించి 1,43,600 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.10,339 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చింది. 365 చ.అ ఇళ్లకు 44,304 మంది లబ్ధిదారులు రూ.50 వేలు, 430 చ.అ. ఇళ్లకు 74,312 మంది లబ్ధిదారులు రూ.లక్ష చొప్పున వాటా చెల్లించాలని గత ప్రభుత్వం నిబంధన పెడితే, దాన్ని జగన్‌ ప్రభుత్వం సగానికి తగ్గించింది.

అంతేకాకుండా లబ్ధిదారులు చెల్లించాల్సిన రూ.482.32 కోట్లను కూడా ప్రభుత్వమే చెల్లించింది. రెండు, మూడు కేటగిరీల్లోని లబ్ధిదారులు గత ప్రభుత్వ ధరల ప్రకారం రూ.10,797 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. ప్రభుత్వ చర్యలతో ఆ మొత్తం రూ.4,590 కోట్లకు దిగివచ్చింది. మౌలిక సదుపాయాలకు సైతం గత సర్కారు కేవలం రూ.306 కోట్లు కేటాయించి చేతులు దులుపుకుంది. వైఎస్‌ జగన్‌ సర్కారు రూ.3,237 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది.

రివర్స్‌ టెండరింగ్‌లో చ.అడుగుకు నిర్మాణ వ్యయాన్ని రూ.1,692 తగ్గించడంతో పాటు అన్ని పనుల్లోనూ దాదాపు రూ.4,368 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేసింది. అన్ని కేటగిరీల ఇళ్ల లబ్ధిదారులకు సేల్‌డీడ్, స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు, యూజర్‌ ఛార్జీలను మినహాయించడంతో లబ్ధిదారులు మొత్తం రూ.5,487.32 కోట్లు మేలు పొందారు. 

ఇళ్ల పంపిణీ తాజా షెడ్యూల్‌.. 
► జనవరి 4న అనకాపల్లి జిల్లాలో సత్యనారాయణపురం 2,744 గృహాలు.
► 6న గుంటూరు జిల్లా అడవి తక్కెళ్లపాడులో 4,192, 

వెంగళాయపాలెంలో 1,888.
► జనవరి రెండో వారంలో మచిలీపట్నంలో 864, పెద్దాపురంలో 1,584.
మూడో వారంలో నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 15,552, వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో 1,008, మదనపల్లి మున్సిపాలిటీలో 1,872, చిత్తూరు మున్సిపాలిటీలో 2,832.

► నాలుగో వారంలో విజయనగరం జిల్లా సారిపల్లిలో 352, సోనియానగర్‌లో 1,088, శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 548, విశాఖ జిల్లా దబ్బందలో 1,920, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 1,248, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో 480, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో 192, పలాసలో 912. రెండో దశలో 6,500 ఇళ్లను కూడా పంపిణీ చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 800, పాలకొల్లులో 1,024, తాడేపల్లిగూడెంలో 1,124, కడపలో 9,912, విశాఖపట్నంలోని 11 ప్రాంతాల్లో 6,048.
► ఫిబ్రవరి మొదటి వారంలో పార్వతీపురం మున్సిపాలిటీలో 768 ఇళ్లు. 

>
మరిన్ని వార్తలు