NABARD Annual Report: వ్యవసాయ మౌలిక వసతుల కల్పనలో ఏపీ టాప్‌ 

10 May, 2022 10:44 IST|Sakshi

సాక్షి, అమరావతి: వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ఆస్తుల కల్పనకు 2021–22 బడ్జెట్‌లో ఏపీ ప్రభుత్వం రూ.11,477 కోట్లు కేటాయించినట్లు నాబార్డు వార్షిక నివేదిక స్పష్టం చేసింది. ఈ రంగంలో సగటు వార్షిక వృద్ధి రేటు 2.2 శాతం ఉన్నట్లు వెల్లడించింది. దేశంలోని వివిధ రాష్ట్రాలు వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్‌లో కేటాయింపులపై నాబార్డు వార్షిక నివేదిక విశ్లేషించింది.
చదవండి: ఏది నిజం: రోడ్లపై గుంతలా? రామోజీ కళ్లకు గంతలా? 

ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పనకు మధ్యప్రదేశ్, తెలంగాణ, కేరళ, జార్ఖండ్‌ రాష్ట్రాల కేటాయింపులు తిరోగమనంలో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఏపీలో వ్యవసాయ రంగంలో స్టోరేజి, వేర్‌హౌసింగ్, సాగునీరు, ఇతర వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు నివేదిక తెలిపింది. రాష్ట్రంలో గ్రామ స్థాయిలోనే వ్యవసాయానికి అవసరమైన సకల మౌలిక వసతులను రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న విషయం తెలిసిందే.

రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగానే రైతులు పండించిన పంటల నిల్వ కోసం అవసరమైన గోదాములను సైతం నిర్మిస్తోంది. రైతులు పండించిన ధాన్యాన్ని కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే సేకరిస్తున్న విషయం తెలిసిందే. రూ.2,269.30 కోట్ల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 10,315 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో ఇప్పటికే 2,287 భవనాల నిర్మాణాలు పూర్తి కాగా మరో 1,948 భవనాలు తుది దశలో ఉన్నాయి. మొత్తం నిర్మాణాలను ఈ ఏడాది సెపె్టంబర్‌ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని అధికారుల లక్ష్యంగా నిర్ధారించుకున్నారు. అలాగే, పాడి రైతుల కోసం రూ.399.01 కోట్ల వ్యయంతో తొలి దశలో 2,535 బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్ల నిర్మాణాలను చేపట్టిన విషయం తెలిసిందే.  

మరిన్ని వార్తలు