ఏపీ ఓ బంగారు గని 

5 Mar, 2023 04:46 IST|Sakshi

రాష్ట్రంలో పుష్కలంగా గ్రీన్‌ అమ్మోనియా.. పునరుత్పాదక ఇంధనంపై ప్రభుత్వ చర్యలు భేష్‌ 

సీఎం జగన్‌ దార్శనికుడు  వాణిజ్య, ఆర్థిక సంబంధాలపై 

రాష్ట్రంతో కలిసి పనిచేయడానికి సిద్ధం 

జీఐఎస్‌లో ఫార్టెస్క్యూ ఫ్యూచర్‌ ఇండస్ట్రీస్‌ సౌత్, సౌత్‌ఈస్ట్‌ అధ్యక్షుడు అలార్డ్‌ 

దొండపర్తి (విశాఖ దక్షిణ): పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి అవసరమయ్యే గ్రీన్‌ అమ్మోనియా ఏపీలో పుష్కలంగా ఉందని, రాష్ట్రం ఒక బంగారు గని అని ఫార్టెస్క్యూ ఫ్యూచర్‌ ఇండస్ట్రీస్‌ సౌత్‌ అండ్‌ సౌత్‌ఈస్ట్‌ అధ్యక్షుడు అలార్డ్‌ ఎం.నూయ్‌ అభివర్ణించారు . గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌) రెండోరోజైన శనివారం ఆడిటోరియం–4లో పశ్చిమ ఆస్ట్రేలియా, వియత్నాం దేశాల ప్రతినిధులతో సెషన్స్‌ నిర్వహించారు.

ఇందులో పశ్చిమ ఆ్రస్టేలియా ప్రతినిధిగా పాల్గొన్న అలార్డ్‌ ముందుగా ఆ దేశంలో పునరుత్పాదక ఇంధన ఉత్పతికి అనుసరిస్తున్న మార్గాలు, అందుకు అవసరమయ్యే ఖనిజాలను వెలికితీసేందుకు చేపడుతున్న చర్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిసారించడం ప్రశంసించదగ్గ విషయమన్నారు. రాష్ట్రంలో గ్రీన్‌ హైడ్రోజన్, గ్రీన్‌ అమ్మోనియా ద్వారా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం శుభపరిణామమన్నారు.

భవిష్యత్తులో గ్రీన్‌ హైడ్రోజన్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిపైనే దేశాలన్నీ దృష్టిసారిస్తాయని అలార్డ్‌ అభిప్రాయపడ్డారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల ఏర్పాటుకు కొన్ని ప్రైవేటు పరిశ్రమలతో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఒప్పందాలు చేసుకుందని గుర్తుచేశారు. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికతకు నిదర్శనమని కొనియాడారు. దీని ఫలితంగానే రాష్ట్రం ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా మూడో ఏడాది కూడా ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రస్తుతించారు. 

ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏపీ టాప్‌ 
దేశంలో ఆక్వా ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ కీలక భూమిక పోషిస్తోందని మెరైన్‌ ప్రొడక్ట్స్‌ ఎక్స్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ టీఆర్‌ గిబిన్‌కుమార్‌ తెలిపారు. జీఐఎస్‌లో జరిగిన మరో సెషన్‌లో రాష్ట్రంలో ఆక్వా, మెరైన్‌ ఉత్పత్తులు, ఇక్కడున్న వ్యాపార అవకాశాలను వియత్నాం ఎంబసీ ప్రతినిధులకు ఆయన వివరించారు.

ఈ సందర్భంగా గిబిన్‌కుమార్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కొత్త పోర్టులతోపాటు ప్రతీ 50 కిలోమీటర్లకు ఒక హార్బర్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందన్నారు. ఒకవైపు సముద్ర ఉత్పత్తులతోపాటు రిజర్వాయర్లు, చెరువులు, ఇతర ఆక్వా ఉత్పత్తులను ప్రోత్సహించే విషయంపై ప్రభుత్వం దృష్టిసారించిందని చెప్పారు. అలాగే.. మెరైన్, ఆక్వా రంగానికి అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ఉత్పత్తుల ఎగుమతులపై కూడా దృష్టిసారించాలని వియత్నాం ఎంబసీ ట్రేడ్‌ ఆఫీస్‌ ఫస్ట్‌ సెక్రటరీ డూ డుయ్‌ ఖాన్, ఎంబసీ పొలిటికల్‌ కౌన్సిలర్‌ థి ఎన్‌జాగ్‌ డెంగ్‌ ఎన్‌గుయెన్‌లను కోరారు. అలాగే, వియత్నాం మెరైన్‌ రంగంలో ఉన్న వాణిజ్య, వ్యాపార అవకాశాలను ఎంబసీ అధికారులు వివరించారు. ఈ సెషన్‌లో స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ టెక్నాలజీ అడిషినల్‌ డైరెక్టర్‌ పి. కోటేశ్వరరావు, మ్యాట్రిక్స్‌ సీ ఫుడ్స్‌ ఇండియా లిమిటెడ్‌ సీఈఓ 
శివప్రసాద్‌ వెంపులూరు పాల్గొన్నారు.  


ఏపీతో కలిసి పనిచేస్తాం..
గత కొన్నేళ్లుగా పశ్చిమ ఆ్రస్టేలియా.. భారత్‌తో, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంతో కలిసి వాణిజ్య, ఆర్థిక కార్యకలాపాలను కొనసాగిస్తోందని అలార్డ్‌ గుర్తుచేశారు. భవిష్యత్తులో మరిన్ని పెట్టుబడులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభు­త్వం తీసుకుంటున్న చొరవను ఆయన అభినందించారు.

అయితే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు, ప్రాజెక్టులకు కల్పించే మౌలిక సదుపాయాలపై పాలసీ ప్రకటిస్తే విదేశీ పెట్టుబడులు ఆంధ్రాకు పెద్దఎత్తున వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. ప్రభు­త్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక రాష్ట్రంతో మరిన్ని వాణిజ్య, ఆర్థిక సంబంధాల మెరుగుకోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 

త్వరలో కొత్త ఇండస్ట్రీ పాలసీ 
దేశంలో ఉన్న పారిశ్రామిక దిగ్గజ సంస్థలే    కాకుండా విదేశాల నుంచి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రభుత్వం దృష్టిసారించిందని రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కె. విజయానంద్‌ తెలిపారు. ఇందులో భాగంగా త్వరలోనే ప్రభుత్వం కొత్త ఇండ్రస్టియల్‌ పాలసీని ప్రవేశపెట్టనుందన్నారు. దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించేలా ఈ పాలసీని రూపొందించినట్లు వివరించారు.

రాష్ట్రంలో అవలంబిస్తున్న మైనింగ్‌ విధానాలు, అందుబాటులో ఉన్న వనరులను మైన్స్‌ డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డి వివరించారు. ఈ సమావేశానికి     పశ్చిమ ఆ్రస్టేలియా ప్రతినిధులకు, రాష్ట్ర అధికారులకు సమన్వయకర్తగా ట్రేడ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కమిషనర్‌ నషీద్‌ చౌదరి వ్యవహరించగా, హెచ్‌ఏఎస్‌ హోల్డింగ్స్‌ డైరెక్టర్‌ అక్షయ్‌ పాల్గొన్నారు. 
 

>
మరిన్ని వార్తలు