టెలీమెడిసిన్‌ సేవల్లో ఏపీనే టాప్‌ 

3 Dec, 2023 02:44 IST|Sakshi

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి 18.3 కోట్ల కన్సల్టేషన్లు

అందులో 25%.. అంటే 4.6 కోట్ల కన్సల్టేషన్లు ఏపీ నుంచే 

రాష్ట్రం నుంచి రోజుకు సగటున 70 వేల కన్సల్టేషన్లు 

27 హబ్‌ల ద్వారా ప్రజలకు టెలీ మెడిసిన్‌ సేవలు అందిస్తున్న ప్రభుత్వం 

సాక్షి, అమరావతి: ప్రజలకు వ్యయప్రయాసలు లేకుండా ఇంటికి చేరువలోనే వైద్య సేవల కల్పనలో సీఎం జగన్‌ ప్రభుత్వం సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. వైద్య, ఆరోగ్య శాఖలో పలు సంస్కరణలు తె చ్చింది. పీహెచ్‌సీల నుంచి జిల్లా ప్రధాన ఆస్పత్రులు, బోధనాస్పత్రుల వరకు అన్ని ఆస్పత్రులను అధునాతనంగా తీర్చి దిద్దుతోంది.

ప్రజలకు అత్యంత అధునాతన వైద్యాన్ని అందుబాటులోకి తెస్తోంది. దీంతోపాటు ఫ్యామిలీ డాక్టర్‌ విధానంతో వైద్యులనే గ్రామాలకు పంపి, ప్రజల ముంగిటకే వైద్య సేవలను తీసుకెళ్లింది. టెలీమెడిసిన్‌లోనూ అధునాతన వైద్యాన్ని ప్రజలకు అందించడంలోనూ ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఈ–సంజీవని టెలిమెడిసిన్‌ సేవలను 2019 నవంబర్‌లో దేశవ్యాప్తంగా ప్రారంభించారు.

ఈ విధానంలో ప్రజలకు స్పెషలిస్టు వైద్యుల ద్వారా అత్యంత వేగంగా, సమర్ధవంతమైన సేవలు అందించడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రం తొలి స్థానంలో నిలుస్తోంది. ఏపీ స్థానాన్ని మరే రాష్ట్రం అధిగమించలేకపోతోంది. 

నాలుగో వంతు ఏపీ నుంచే 
2019 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18.3 కోట్ల టెలికన్సల్టేషన్లు నమోదు కాగా, వీటిలో 25 శాతం ఒక్క ఏపీ నుంచే ఉన్నాయి. ఏపీ 4,61,01,963 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. 2.60 కోట్లతో పశ్చిమ బెంగాల్‌ రెండో స్థానంలో ఉంది.  మన రాష్ట్రం నుంచి సగటున రోజుకు 70 వేల కన్సల్టేషన్లు నమోదవుతున్నాయి. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకూ 1.64 కోట్ల కన్సల్టేషన్లు నమోదయ్యాయి. 

మూడు రకాల స్పెషలిస్ట్‌ వైద్యులు 
రాష్ట్రంలో టెలిమెడిసిన్‌ సేవలు అందించడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం 26 జిల్లాల్లోని వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో 27 హబ్‌లను చేసింది. ఈ హబ్‌లకు పీహెచ్‌సీలు, వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను అనుసంధానం చేసింది. ప్రతి హబ్‌లో ఇద్దరు జనరల్‌ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్‌ స్పెషలిస్ట్‌ వైద్యు­లతో పాటు, ఇద్దరు మెడికల్‌ ఆఫీసర్లు సేవలందిస్తున్నారు.

పీహెచ్‌సీ, విలేజ్‌ క్లినిక్‌కు వచ్చిన రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమున్న సందర్భాల్లో టెలీమెడిసిన్‌ ద్వారా హబ్‌లోని వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు చికిత్స చేస్తున్నారు. హబ్‌లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్‌ రూపంలో రోగులతో మాట్లాడి వారికి సలహాలు, సూచనలు తెలియజేయడంతో పాటు మందులు సూచిస్తారు. ఆ మందులను పీహెచ్‌సీ, విలేజ్‌ క్లినిక్‌లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు.

మరిన్ని వార్తలు