ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఏపీ పర్యాటకం

27 Sep, 2020 06:10 IST|Sakshi

టూరిజం, సేవా రంగాలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం కొత్త పాలసీ

భవిష్యత్‌లో రాష్ట్రానికి గ్రోత్‌ ఇంజన్‌.. పర్యాటకమే

నేడు విశాఖలో ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు తగిన స్థానం దక్కేలా అవసరమైన అన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు నూతన పర్యాటక పాలసీని ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, వసతులు, భద్రత తదితరాలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. పర్యాటక రంగంలో ప్రైవేట్‌ పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. వాటర్‌ స్పోర్ట్స్‌ ఏర్పాటు చేసే సంస్థలకు పన్ను రాయితీ ఇస్తుంది. ట్రావెల్‌ ఏజెంట్లు, సంస్థలు, హోటళ్లు, తదితరాలన్నీ పర్యాటక శాఖ వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని నిర్దేశించింది. కాగా.. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘పర్యాటకం–గ్రామీణాభివృద్ధి’ నినాదంతో ఆదివారం విశాఖపట్నంలో ప్రభుత్వం వేడుకలు నిర్వహిస్తోంది.   

పర్యాటక ప్రాంతాల అభివృద్ధి
► దేశంలో గుజరాత్‌ తర్వాత 974 కి.మీ. పొడవైన సముద్ర తీరం ఏపీకి మాత్రమే సొంతం. 
► ప్రముఖ బీచ్‌ల వద్ద ప్రైవేట్‌ భాగస్వామ్యంతో కుటీరాలు, తదితరాలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ పర్యాటకంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న కళలను తెలిపేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. వ్యవసాయ పర్యాటకంలో భాగంగా వ్యవసాయ భూముల్లో అతిథ్యం కల్పిస్తారు. 
► ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రాచీన కట్టడాల పునరుద్ధరణ. రాష్ట్రంలో 12 నుంచి 14 ప్రాంతాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు.
► అరకులో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో కాలేజ్‌ను ఏర్పాటు చేస్తారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు 7 స్టార్‌ సదుపాయాలతో రిసార్టులు, హోటళ్లను అందుబాటులోకి తెస్తారు. 
► పర్యాటకుల భద్రత కోసం దేశంలోనే తొలిసారి పశ్చిమగోదావరి జిల్లా సింగనపల్లి, పేరంటాలపల్లి, పోచవరం, తూర్పుగోదావరి జిల్లా గండి పోచమ్మ, రాజమండ్రి, విశాఖజిల్లా రుషికొండ, గుంటూరు జిల్లా నాగార్జునసాగర్, కర్నూలు జిల్లా శ్రీశైలం, కృష్ణా జిల్లా విజయవాడలోని బెరం పార్క్‌ల వద్ద కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు. 

‘బ్లూఫ్లాగ్‌’’ సర్టిఫికేషన్‌ కోసం ఎంపికైన రుషికొండ బీచ్‌
బ్లూఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ కోసం విశాఖలోని రుషికొండ బీచ్‌ ఎంపికైందని మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. శనివారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏమన్నారంటే..
► గతేడాది విదేశీ పర్యాటకులను ఆకర్షించడంతో ఆదాయం 21% పెరిగింది. ఎకో టూరిజం, అడ్వెంచర్‌ టూరిజం, టెంపుల్‌ టూరిజంలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం.  
► కాగా, రాజకీయంగా ఎదగడానికి చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని మంత్రి మండిపడ్డారు. కులమతాల మధ్య చిచ్చు పెడుతున్న టీడీపీ, బీజేపీలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.

బ్లూఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ అంటే..
సదుపాయాలు ఉండి.. అంతర్జాతీయ ప్రసిద్ధి పొందిన బీచ్‌లకు డెన్మార్క్‌లోని ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్‌ఈఈ) బ్లూఫ్లాగ్‌ సర్టిఫికేషన్‌ను ఇస్తుంది. ఈ సర్టిఫికేషన్‌ ఉన్న బీచ్‌లనే అంతర్జాతీయ పర్యాటకులు ఎక్కువగా సందర్శిస్తారు. సర్టిఫికేషన్‌కు కేంద్రం 8 బీచ్‌లను ఎంపిక చేయగా రుషికొండ కూడా ఉంది. 

మరిన్ని వార్తలు