ఏడుగురి కోసం 700 కి.మీ. ప్రయాణం..

22 Jun, 2021 08:26 IST|Sakshi
కర్ణాటకలోని తుమ్ముకూరులో ఉన్న చిలుకూరువాసులతో ఈకేవైసీ చేయిస్తున్న వలంటీర్‌ అశోక్‌

వలంటీర్‌ చిత్తశుద్ధి

చిల్లకూరు: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు నేరుగా, పదిలంగా అందించటంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు వలంటీర్లు. తమ పరిధిలో ఉండే కుటుంబాల్లో ఒకరిగా కలిసి పోయి సేవలందిస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన చేయూత పథకంతో పాటుగా వైఎస్సార్‌ బీమా యోజన పథకానికి అర్హులైన లబ్ధిదారులతో ఈకేవైసీ చేయించాల్సి ఉంది. దీంతో వలంటీర్లు ఆ పనిలో నిమగ్నమయ్యారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం చిల్లకూరు మిక్సెడ్‌ కాలనీకి చెందిన 70 కుటుంబాలను వలంటీర్‌ శ్రీరాం అశోక్‌కు కేటాయించారు. అయితే అందులోని ఏడు కుటుంబాలు బుట్టలు అల్లుకుని, వాటిని విక్రయించుకునేందుకు ఇతర రాష్ట్రాలకు వలస పోయాయి.

కోవిడ్‌ కారణంగా వారంతా కర్ణాటక రాష్ట్రంలోని తుమ్ముకూరు ప్రాంతంలో చిక్కుకుపోయారు. ఈకేవైసీ చేయించుకోవాలని వలంటీర్‌ వారికి సమాచారం ఇవ్వగా, వారు తాము రాలేక పోతున్నామని తెలియజేశారు. దీంతో లబ్ధిదారులు నష్ట పోకుండా చూడాలని భావించిన వలంటీర్‌ అశోక్‌ చిల్లకూరు నుంచి తుమ్ముకూరుకు సుమారు 700 కి.మీ. దూరం ఉన్నప్పటికీ వెరవకుండా బైక్‌పై తన సొంత ఖర్చులతో వెళ్లాడు. ఏడుగురు లబ్ధిదారుల చేత ఈకేవైసీ చేయించి, పథకాలకు సంబంధించి ఆన్‌లైన్‌లో వారి వివరాలు నమోదు చేశాడు. వలంటీర్‌ అశోక్‌ను మండల అధికారులు, స్థానికులు అభినందించారు.

మరిన్ని వార్తలు