ఒడిశా అధికారుల అదుపులోనే ఏపీ గ్రామాలు

11 Feb, 2021 05:52 IST|Sakshi
గుడ్డికోలలో పహరా కాస్తున్న ఒడిశా పోలీసులు

పోలింగ్‌లో పాల్గొనవద్దంటూ గిరిజనులకు బెదిరింపులు

పోలీసులను మోహరించి భయభ్రాంతులకు గురిచేస్తున్న వైనం  

మందస: రాష్ట్ర సరిహద్దులోని గిరిజన గ్రామాలపై ఒడిశా అధికారుల దౌర్జన్యం కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం సాబకోట, బుడారిసింగి పంచాయతీల్లోని పలు గ్రామాలను ఒడిశా అధికారులు, పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. తాము ఏపీలోనే ఉంటామని చెబుతున్నా కూడా.. ఒడిశా అధికారులు మాత్రం స్థానిక ఎన్నికల్లో ఓట్లు వేయొద్దంటూ గిరిజనులను బెదిరిస్తున్నారు. సాబకోట పంచాయతీ పరిధిలోని మాణిక్యపట్నం, మధ్యకోల.. బుడారిసింగి పంచాయతీలోని గుడ్డికోల గ్రామాలు ఒడిశా పరిధిలోనే ఉన్నాయని ఆ రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. కానీ ఈ గ్రామస్తుల రేషన్, ఆధార్‌ కార్డులు ఏపీకి చెందినవే.

ఏపీ నుంచే సంక్షేమ పథకాలనూ అందుకుంటున్నారు. అయినా కూడా ఒడిశా అధికారులు మొండిగా వ్యవహరిస్తూ.. గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగిన పలువురిని బెదిరించి.. నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారు. ఆర్‌డీవో స్థాయి అధికారులతో పాటు పోలీసులు కూడా ఈ గ్రామాల్లో తిరుగుతూ.. ఏపీలో ఓట్లు వేయొద్దని గిరిజనులను బెదిరిస్తున్నారు. బుధవారం ఈ గ్రామాల్లో ఏకంగా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. గురువారం మరిన్ని బలగాలను దించుతామని, ప్రజలెవరూ పోలింగ్‌లో పాల్గొనడానికి వీల్లేదని హెచ్చరించారు.

గిరిజనులు మాత్రం ఏపీలోనే ఉంటామని.. పోలింగ్‌లో పాల్గొనేందుకు అవకాశమివ్వాలని వేడుకుంటున్నారు. ఈ విషయం మంత్రి సీదిరి అప్పలరాజు దృష్టికి వెళ్లడంతో.. ఆయన ఒడిశా అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నారు. తహసీల్దార్‌ బడే పాపారావు మాట్లాడుతూ.. పోలీసు బలగాలను ఏర్పాటు చేసి ఈ గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరిపిస్తామన్నారు.  

మరిన్ని వార్తలు