కాఫీ.. సాగు హ్యాపీ

1 Jul, 2021 22:54 IST|Sakshi

కేరళను వెనక్కినెట్టి ద్వితీయ స్థానంలో నిలిచిన ఏపీ

రాష్ట్రంలో విశాఖ మన్యానిదే అగ్రస్థానం

80 శాతం మంది గిరిజన రైతులకు కాఫీ సాగే వ్యాపకం

13 వేల టన్నుల వరకూ దిగుబడికి అవకాశం

సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యంలో లక్షకు పైగా గిరిజన రైతు కుటుంబాలకు కాఫీ తోటలు మంచి ఆదాయాన్ని సమకూర్చే వనరుగా మారాయి. ఇక్కడి మన్యంలోని 200 గ్రామ పంచాయతీల పరిధిలో కాఫీ తోటలు విస్తరించాయి. కాఫీ తోటల్లోనే అంతర పంటగా మిరియం సాగు చేస్తూ.. అధిక ఆదాయం పొందుతుండటం విశేషం. దీనికి తోడు ప్రభుత్వ ప్రోత్సాహంతో మిగతా రైతులు కూడా కాఫీ తోటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ సానుకూల పరిణామంతో మన రాష్ట్రం కాఫీ సాగు విస్తీర్ణంలో కర్ణాటక తర్వాత స్థానంలో నిలబడింది.

‘తూర్పు’న అడుగుపెట్టి..
కాఫీ మొక్కలను తొలుత మన రాష్ట్రానికి తీసుకొచ్చింది బ్రాడీ అనే ఆంగ్లేయుడు. 1898లో తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలోని పాములేరు లోయలో ఈ మొక్కలను నాటించాడు. తర్వాత రిజర్వు ఫారెస్ట్‌లో పోడు వ్యవసాయం కోసం చెట్లు నరికివేయడాన్ని నివారించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ) వాణిజ్య తరహాలో కాఫీ సాగు వైపు గిరిజన రైతులను ప్రోత్సహించింది. అలా 1960లో మొదలైన సాగు 1985 నాటికి 10,107 ఎకరాలకు విస్తరించింది. ఇప్పుడు అవన్నీ ఏపీఎఫ్‌డీసీ ఆధీనంలోనే ఉన్నాయి. తర్వాత కాలంలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ), పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) రంగంలోకి దిగాయి.

1985 నుంచి వివిధ పథకాలతో రైతులను కాఫీ సాగువైపు ప్రోత్సహిస్తూ వస్తున్నాయి. కాఫీ బోర్డు నిపుణుల సలహాలు, పర్యవేక్షణ ఎంతో ఉపకరిస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో కాఫీ తోటల విస్తీర్ణం 2019లో 2,10,390 ఎకరాలు కాగా 2020 నాటికి 2,22,390 ఎకరాలకు చేరింది. ఇందులో 2.12 లక్షల ఎకరాలు విశాఖ మన్యంలోనే ఉండటం విశేషం. ప్రభుత్వం సహకారంతో గిరిజన రైతులు ఏటా 10 వేల నుంచి 12 వేల ఎకరాల విస్తీర్ణంలో కొత్తగా కాఫీ సాగును చేపడుతున్నారు. దీంతో ఇన్నాళ్లూ కర్ణాటక తర్వాత గుత్తాధిపత్యంతో ఉన్న కేరళ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టి మన రాష్ట్రం ద్వితీయ స్థానానికి చేరుకుంది. 

మరింత విస్తరణే లక్ష్యంగా...
కాఫీ తోటలను 2025–26 సంవత్సరం నాటికి మరో 58 వేల ఎకరాల్లో సాగు చేయించాలనే లక్ష్యంతో పాడేరు ఐటీడీఏ ఓ ప్రణాళిక అమలు చేస్తోంది. కాఫీ మొక్కలకు నీడ చాలా ముఖ్యం. అటవీ ప్రాంతంలో దట్టమైన చెట్లు ఉన్నచోట్ల వాటి మధ్య నేరుగా నాటుతున్నారు. అలాంటి సౌకర్యం లేనిచోట్ల మూడేళ్లు ముందుగా సిల్వర్‌ ఓక్‌ చెట్లను పెంచుతున్నారు. ఇందుకోసం గ్రామ స్థాయిలో సిల్వర్‌ ఓక్‌ నర్సరీలు నిర్వహించేలా గిరిజనులను ఐటీడీఏ ప్రోత్సహిస్తోంది. కాఫీ తోటల మధ్య అంతర పంటగా మిరియం వేసేందుకు కూడా ప్రత్యేక నర్సరీలు నిర్వహిస్తున్నారు.

ప్రభుత్వ సహకారంతో ముందుకు..
విశాఖ మన్యంలో కాఫీ సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో అమలు చేస్తున్న మరో కార్యక్రమం ‘చింతపల్లి ట్రైబల్‌ ఆర్గానిక్‌ కాఫీ ప్రాజెక్ట్‌’. ఈ ప్రాజెక్టు ద్వారా చింతపల్లి మండలంలో చిన్న, సన్నకారు కాఫీ రైతులను ఏకం చేసి రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్‌పీవో)ను ఏర్పాటు చేసింది. దీన్ని మ్యాక్స్‌ (ఎంఏసీఎస్‌) చట్టం కింద రిజిష్టర్‌ చేయించింది. దీనివల్ల రైతులు మంచి ధర పొందడానికి అవకాశం ఏర్పడింది. వారే కాఫీ గింజలను నిపుణుల పర్యవేక్షణలో మేలైన పద్ధతుల్లో పల్పింగ్‌ చేస్తున్నారు. క్లీన్‌ కాఫీ గింజలను టాటా కాఫీ వంటి కార్పొరేట్‌ సంస్థలకు విక్రయిస్తున్నారు. 

అంతర పంటతో అదనపు ఆదాయం
ఎకరా విస్తీర్ణంలో 900 వరకూ కాఫీ మొక్కలు వేస్తున్నారు. ఒక్కో మొక్క నుంచి ఏటా కిలో నుంచి 1.20 కిలోల వరకూ.. ఎకరానికి సగటున 100 నుంచి 120 కిలోల వరకూ క్లీన్‌ కాఫీ గింజల దిగుబడి వస్తోంది. తద్వారా రూ.20 వేల నుంచి రూ.30 వేల ఆదాయం లభిస్తోంది. అంతర పంటగా కాఫీ తోటల మధ్య 100 నుంచి 160 మిరియం మొక్కలు వేస్తున్నారు. ఇవి రెండేళ్లలో కాపు కాస్తున్నాయి.

వాటిద్వారా రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకూ అదనపు ఆదాయం వస్తోంది. మొత్తం మీద ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.90 వేల వరకూ ఏటా ఆదాయం పొందే అవకాశం ఉండటంతో మిగతా రైతులు కూడా కాఫీ తోటల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో అడవులను నరికి పోడు వ్యవసాయం చేసినవారే ఇప్పుడు అదే పోడు భూముల్లో దట్టమైన చెట్లను పెంచి కాఫీ తోటలను సాగు చేయడం విశేషం. 

మంచి దిగుబడి కాలం
గత ఏడాది క్లీన్‌ కాఫీ గింజల దిగుబడి 11 వేల టన్నులు వచ్చింది. ఈసారి 13 వేల టన్నులకు పెరిగే అవకాశం ఉంది. సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులు ఇప్పటికే 50 వేల ఎకరాల్లో సిల్వర్‌ ఓక్‌ మొక్కలను వేశారు. ఇతర ఆహార, చిరుధాన్యాల పంటల కన్నా కాఫీ, మిరియాల పంట నుంచి మెరుగైన ఆదాయం సంవత్సరం పొడువునా వస్తుండటంతో మరింత మంది ఆసక్తి చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో మరో లక్ష ఎకరాల్లో కాఫీ సాగు విస్తరించే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు