ఖరీఫ్‌ సాగు పండుగే!

1 Mar, 2021 04:48 IST|Sakshi

వచ్చే ఖరీఫ్‌కు 21.7 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు కావాలని కోరిన రాష్ట్రం

20.45 లక్షల మెట్రిక్‌ టన్నులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం

రాష్ట్రాల వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో నిర్ణయం

రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచన

సాక్షి, అమరావతి: రానున్న ఖరీఫ్‌–2021 సీజన్‌లో అవసరాలకు సరిపడా ఎరువులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పంటల సాగు లక్ష్యం, నేలల్లో పోషకాల లభ్యతను బట్టి ఖరీఫ్‌ సీజన్‌కు 21.7 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా 20.45 లక్షల మెట్రిక్‌ టన్నులు అందించడానికి కేంద్రం అంగీకరించింది. అయితే రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువులను వినియోగించేలా వారిని చైతన్యపర్చాలని సూచించింది. ఈ మేరకు ఖరీఫ్‌–2021 సీజన్‌లో సాగు లక్ష్యం, భూసార పరిస్థితులు, ఎరువుల డిమాండ్, తదితర అంశాలపై గురువారం ఢిల్లీలో వివిధ రాష్ట్రాల వ్యవసాయ కమిషనర్లు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ కార్యదర్శి, ఎరువుల విభాగం ఇన్‌చార్జ్‌ నీరజ సుదీర్ఘంగా చర్చించారు. వివిధ రాష్ట్రాల్లో భూసార పరీక్షలననుసరించి నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం (ఎన్‌పీకే), సూక్ష్మపోషకాల లభ్యత ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకున్నారు. గత ఐదేళ్లలో వినియోగాన్ని బట్టి వివిధ రాష్ట్రాలకు అవసరమైన యూరియా, డీ అమ్మోనియం ఫాస్ఫేట్‌ (డీఏపీ), మ్యూరిట్‌ ఆఫ్‌ పొటాష్‌ (ఎంవోపీ), సింగిల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ (ఎస్‌ఎస్‌పీ), కాంప్లెక్స్‌ ఎరువులపై ఆరా తీశారు.

73.70 శాతం నేలల్లో నత్రజని లోపం
రాష్ట్రంలో 73.70 శాతం నేలల్లో నత్రజని, 14.90 శాతం నేలల్లో భాస్వరం, 11.40 శాతం నేలల్లో పొటాష్, 35 శాతం నేలల్లో జింక్, 24 శాతం నేలల్లో ఐరన్, 17 శాతం నేలల్లో బోరాన్, 14 శాతం నేలల్లో మాలిబ్డినం తక్కువగా ఉన్నట్టు భూసార పరీక్షల ఆధారంగా గుర్తించామని అరుణ్‌కుమార్‌ వివరించారు. ఖరీఫ్‌– 2020లో 18.37 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు వినియోగం కాగా, రానున్న ఖరీఫ్‌లో 2.08 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను కేంద్రం అదనంగా కేటాయిస్తోందన్నారు.

ఖరీఫ్‌–2021 లక్ష్యం 58.79 లక్షల హెక్టార్లు
మన రాష్ట్రానికి సంబంధించి ఖరీఫ్‌–2021లో 58.79 లక్షల హెక్టార్లలో సాగు చేయాలని వ్యవసాయ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ కేంద్రానికి వివరించారు. ప్రధానంగా వరి 16.190, వేరుశనగ 7.45, పత్తి 6.24, కంది 2.70, కూరగాయలు 2.65, మిరప 1.80, మొక్కజొన్న 1.14 లక్షల హెక్టార్లలో, మినుము 41 వేలు, జొన్న 36 వేలు, రాగి 33 వేలు, పెసర 27 వేలు, నువ్వులు 18 వేలు, పొద్దుతిరుగుడు 3,700 హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. 

మరిన్ని వార్తలు