రేపటి నుంచి పెద్దలకూ కోవిడ్‌ టీకా

28 Feb, 2021 05:08 IST|Sakshi

రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన 53 లక్షల మందికి వ్యాక్సినేషన్‌ 

45 ఏళ్లు దాటిన 6.97 లక్షల మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకూ టీకా 

మొత్తంగా 59.96 లక్షల మందికి వ్యాక్సిన్‌ 

రాష్ట్రవ్యాప్తంగా 2,222 ఆస్పత్రుల్లో కోవిడ్‌ టీకా ప్రక్రియ 

రెండు నెలలు.. 48 పని దినాల్లో కార్యక్రమం 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మార్చి 1వ తేదీ నుంచి కోవిడ్‌ టీకాలు వేసే కార్యక్రమం భారీ ఎత్తున జరగనుంది. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా 2,222 ఆస్పత్రుల్లో టీకా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. 60 ఏళ్ల వయసు దాటిన వారు, 45 ఏళ్ల నుంచి 59 ఏళ్లలోపు వయసు గల దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వ్యాక్సిన్‌ వేయనున్నారు. ఇప్పటికే ఫ్రంట్‌లైన్‌ వర్కర్లయిన ఆరోగ్య శాఖ సిబ్బంది, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, మున్సిపాలిటీ తదితర విభాగాల ఉద్యోగులకు కోవిడ్‌ టీకాలు వేసిన విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై రాష్ట్ర టాస్‌్కఫోర్స్‌ కమిటీ శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది. వ్యాక్సిన్‌ ప్రక్రియపై జిల్లా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 

59.96 లక్షల మందికి.. 
ఈ విడతలో 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌ వేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారు రాష్ట్రంలో 52,98,063 మంది ఉన్నట్టు తేల్చారు. వీరితోపాటు 45–59 ఏళ్ల మధ్య వయస్కులై ఉండి రకరకాల దీర్ఘకాలిక జబ్బులు అంటే క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, బీపీ వంటి సమస్యలున్న వారు 6,97,990 మందిగా (ఎన్‌సీడీ–సీడీ డేటా ఆధారంగా) గుర్తించారు. అంటే మొత్తం ఈ విడతలో 59,96,053 మందికి టీకాలు వేస్తారు. వీరంతా కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌ లేదా ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా పేరు, వివరాలు నమోదు చేసుకుని సమీపంలోని వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వెళితే టీకా వేస్తారు. సోమవారం నుంచి 2 నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వారానికి 6 రోజుల చొప్పున 48 రోజుల పాటు కోవిడ్‌ టీకా వేస్తారు. ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మందికి మాత్రమే టీకా వేస్తారు 

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ లేకపోయినా.. 
లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోలేకపోయినా ఆన్‌సైట్‌ సిస్టం ద్వారా కోవిడ్‌ టీకా వేయించుకోవచ్చు. నేరుగా కోవిడ్‌ టీకా కేంద్రానికి వెళ్లి ఆధార్‌ కార్డు, ఓటర్‌ ఐడెంటిటీ, డ్రైవింగ్‌ లైసెన్సు కార్డు, దీర్ఘకాలిక జబ్బులున్నట్టు వైద్యుడి సర్టిఫికెట్, మరేదైనా అధికారిక గుర్తింపు కార్డు ఉన్నట్టు అక్కడ చూపిస్తే టీకా వేస్తారు. అయితే ఆ రోజు రద్దీని బట్టి, కోవిడ్‌ నిబంధనల మేరకు ఆన్‌సైట్‌ వారికి టీకా వేస్తారు. 

స్లాట్‌ బుక్‌ చేసుకుని వెళ్లండి 
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కోవిన్‌ సాఫ్ట్‌వేర్‌ లేదా ఆరోగ్యసేతు యాప్‌ద్వారా స్లాట్‌ నమోదు చేసుకుని టీకాకు వెళ్లడం మంచిది. అలాంటి వారికి కచ్చితంగా అదే రోజు విధిగా టీకా వేయగలరు. అలా కాకుండా గుర్తింపు కార్డుతో వెళ్లే వారికి అదే రోజున టీకా వేసే విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ స్లాట్‌ బుక్‌ చేసుకుని తమకు నిర్ణయించిన తేదీన వెళ్లడం మంచిది. టీకాకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తి చేశాం. 
– కాటమనేని భాస్కర్, కమిషనర్, కుటుంబ సంక్షేమ శాఖ   

>
మరిన్ని వార్తలు