గల్ఫ్‌ వల.. విలవిల.. 4 నెలలుగా జైలులో మగ్గిపోతున్న మహిళలు

1 Sep, 2022 08:54 IST|Sakshi
నకిలీ వీసాలతో మోసపోయి, జైలు పాలైన మహిళల కుటుంబీకులతో హ్యూమన్‌ రైట్స్‌ అసోసియేషన్‌ మహిళా ప్రతినిధులు

నకిలీ వీసాలతో ఉపాధి ఎర

మోసపోయిన 30 మంది మహిళలు కేరళలో అరెస్టు

వీరిలో జిల్లాకు చెందిన పలువురు

4 నెలలుగా జైలులో మగ్గిపోతున్న వైనం

కలెక్టర్‌కు హ్యూమన్‌ రైట్స్‌

మహిళా ప్రతినిధుల ఫిర్యాదు

కేరళకు పోలీసు బృందాన్ని పంపించిన ఎస్పీ

సాక్షి, కోనసీమ(అమలాపురం): గల్ఫ్‌ దేశాల్లో ఉపాధి కల్పిస్తామంటూ మాయమాటలు చెప్పి, అమాయక మహిళలపై కొందరు ఏజెంట్లు వల విసురుతున్నారు. వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి నకిలీ వీసాలతో విమానాలు ఎక్కిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్‌ తనిఖీల సమయంలో ఆ అమాయక మహిళలు నకిలీ వీసాలతో పోలీసులకు పట్టుబడి జైళ్లపాలవుతున్నారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది మహిళలు మోసపోయిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. వీరిలో జిల్లాకు చెందిన మహిళలు ముగ్గురు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. అయితే మరింత మంది జిల్లా మహిళలు అక్కడి జైలులో చిక్కుకున్నారని ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు చెబుతున్నారు.

మోసపోయారిలా.. 
ఉప్పలగుప్తం మండలం కూనవరానికి చెందిన రాంబాబు అనే ఏజెంటు గల్ఫ్‌లో ఉపాధి కల్పించే పేరుతో అమాయకులపై వల విసిరాడు. గల్ఫ్‌లో ఉపాధి పొందడం ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందన్న ఆశతో పలువురు అతడికి రూ.లక్షలు సమర్పించుకున్నారు. అతడి ద్వారా వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది మహిళలు గత మే నెలలో గల్ఫ్‌కు బయలుదేరారు. వీరిలో మన జిల్లా మహిళలూ ఉన్నారు. వారికి ఏజెంటు రాంబాబు వీసాలు ఇచ్చి, గల్ఫ్‌కని చెప్పి, తొలుత హైదరాబాద్‌ పంపించాడు.

అక్కడ రాజు అనే వ్యక్తి వారిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కించాడు. ఆ విమానం కేరళ రాష్ట్రం కొచ్చి ఎయిర్‌పోర్టుకు చేరింది. అక్కడ చేసిన తనిఖీల్లో ఈ 30 మంది మహిళల వీసాలూ నకిలీవని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు గుర్తించారు. గత మే 8వ తేదీన వారిని అరెస్టు చేశారు. అప్పటి నుంచీ ఆ మహిళలు అక్కడి జైళ్లలోనే మగ్గుతున్నారు. ఏజెంట్‌ తమను మోసగించినట్టు గుర్తించిన బాధితులు ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ మహిళా విభాగాన్ని ఆశ్రయించారు. అరెస్టయిన 30 మంది మహిళల్లో ఐదుగురికి హ్యూమన్‌ రైట్స్‌ అసోసియేషన్‌ బెయిల్‌ ఇప్పించింది.

మిగిలిన 25 మంది మహిళలనూ విడిపించేందుకు చర్యలు చేపట్టాలని హ్యూమన్‌ రైట్స్‌ మహిళా విభాగం వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్‌.భవాని సారథ్యంలోని ప్రతినిధులు, బాధిత కుటుంబ సభ్యులు కలెక్టర్‌ హిమాన్షు శుక్లాకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో విజ్ఞాపన అందించారు. దీనిపై కలెక్టర్‌ శుక్లా, జిల్లా ఎస్పీ సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి తక్షణమే స్పందించారు. సంబంధిత ఏజెంటుపై చర్యలు తీసుకోవడంతో పాటు, కేరళ జైలులో ఉన్న మహిళలను విడిపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

గోదావరి జిల్లాల వారే ఎక్కువ 
కేరళలో జైలు పాలైన వారిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. దడాల వెంకటలక్ష్మి (బందనపూడి, కాజులూరు మండలం), గీతారాణి (చల్లపల్లి, ఉప్పలగుప్తం మండలం), శాంతి (తాడికోన, అల్లవరం మండలం), లక్ష్మణరావు (ఆదుర్రు, మామిడికుదురు మండలం), రేలంగి జానకి (రామచంద్రపురం), గెల్లా మంగాదేవి (సుంకరపాలెం, తాళ్లరేవు మండలం), యలమంచిలి పార్వతి (దేవగుప్తం, అల్లవరం మండలం), గుబ్బల శ్రీలక్ష్మి (రావులపాలెం), ఇనగల శిరీష (కోరుకొండ), కోడి బేబీ (నిడదవోలు శివారు సుబ్బరాజుపేట) తదితరులున్నారు.

కేరళకు అధికారుల బృందం 
ఏజెంట్ల మోసాలు, నకిలీ వీసాలు, మహిళల అరెస్టు తదితర అంశాలపై కలెక్టర్, ఎస్పీ చర్చించుకుని, కేరళలో అరెస్టయిన మహిళలను విడిపించేందుకు చర్యలు చేపట్టారు. కేరళ రాష్ట్రం ఎర్నాకుళం జిల్లా ఎస్పీతో కోనసీమ జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి ఫోనులో మాట్లాడారు. నకిలీ వీసాల విషయమై కొన్ని కేసులు నమోదైనట్టు ఎర్నాకుళం ఎస్పీ బదులిచ్చారు. అక్కడి జైళ్లలో చిక్కుకున్న జిల్లా మహిళలను విడిపించేందుకు కోనసీమ నుంచి ఒక పోలీసు అధికారి, ఒక ఐసీడీఎస్‌ అధికారితో కూడిన బృందాన్ని కేరళకు ఎస్పీ పంపించారు.

నిలువునా మోసపోయాం 
నకిలీ వీసాలతో ఏజెంటు రాంబాబు, హైదరాబాద్‌లో రాజు అనే వ్యక్తుల చేతిలో తాము నిలువునా మోసపోయామని రావులపాలేనికి చెందిన బాధిత మహిళ శ్రీలక్ష్మి వాపోయింది. కలెక్టరేట్‌ వద్ద ఆమె విలేకర్లతో తన గోడు వెళ్లబోసుకుంది. కొచ్చి ఎయిర్‌పోర్టులో అరెస్టయిన 30 మంది మహిళల్లో శ్రీలక్ష్మి ఒకరు. అక్కడ జైలులో ఉండగా శ్రీలక్ష్మి భర్త చనిపోయాడు. హ్యూమన్‌ రైట్స్‌ అసోసియేషన్‌ బెయిల్‌ ఇప్పించి, విడిపించడంతో ఆమె స్వగ్రామం రావులపాలెం చేరుకుంది. కొచ్చి జైలులో తాను రెండు వారాలు ఉన్నానని.. డబ్బులు లేక.. సరైన తిండి, నిద్ర లేక నరకం చూశామని ఆవేదన వ్యక్తం  చేసింది. అక్కడ పడిన అవçస్థలను హ్యూమన్‌ రైట్స్‌ మహిళా ప్రతినిధులతో కలిసి కలెక్టర్‌కు శ్రీలక్ష్మి వివరించింది. 

ఐదుగురికి బెయిల్‌ ఇప్పించాం 
కొచ్చి విమానాశ్రయంలో నకిలీ వీసాలతో పట్టుబడి అరెస్టయిన 30 మంది మహిళల్లో ఐదుగురికి బెయిల్‌ మంజూరయ్యేలా మా హ్యూమన్‌ రైట్స్‌ అసోసియేషన్‌ మహిళా విభాగం కృషి చేసింది. బెయిలో పొందిన వారిలో శ్రీలక్ష్మి (రావులపాలెం), పార్వతి (అల్లవరం మండలం దేవగుప్తం), జానకి (రామచంద్రపురం), మంగాదేవి (యానాం), సౌజన్య (ఏలూరు) ఉన్నారు. ఇంకా కొంత మంది మహిళలు కేరళ రాష్ట్ర జైలులో ఉన్నట్లు మాకు సమాచారం వచ్చింది.
– నల్లబోతుల భవాని, ఏపీ రాష్ట్ర వైస్‌ చైర్మన్, ఇంటర్నేషనల్‌ హ్యూమన్‌ రైట్స్‌ అసోసియేషన్‌ వుమెన్‌ సెల్, రాజమహేంద్రవరం 

ఏజెంట్లపై చర్యలు 
గల్ఫ్‌లో ఉపాధి పేరుతో మహిళలను మోసగిస్తున్న ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. కేరళలో నకిలీ వీసాలతో అరెస్టయిన జిల్లా మహిళలున్నారన్న ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నాం. అక్కడ జిల్లా మహిళలు ముగ్గురు మాత్రమే ఉన్నారని తెలిసింది. వీరిలో ఒకరు బెయిల్‌పై వచ్చారు. మిగిలిన ఇద్దరినీ విడిపించేందుకు అక్కడికి ప్రత్యేక బృందాన్ని పంపించాం.
– సీహెచ్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఎస్పీ  

మరిన్ని వార్తలు