ఆ.. పిల్లలను ఆదుకుంటాం 

24 Sep, 2021 03:05 IST|Sakshi
చిన్నారులను ఓదారుస్తున్న వాసిరెడ్డి పద్మ

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ

ఆత్మకూరు: భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన మెప్మా రిసోర్స్‌పర్సన్‌ మొద్దు కొండమ్మ పిల్లలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో భర్త కిరాతకానికి బలైన కొండమ్మ కుటుంబీకులను వాసిరెడ్డి పద్మ గురువారం పరామర్శించారు. చిన్నారులైన కొండమ్మ కుమారులు ధనుష్, తరుణ్‌తో పాటు తల్లి పెంచలమ్మను, సోదరులను ఆమె ఓదార్చారు.

కొండమ్మ కుమారుడు తరుణ్‌ గుండెజబ్బుతో బాధపడుతున్న విషయం తెలుసుకుని వైద్యపరీక్షలు నిర్వహించేలా చూడాలని ఐసీడీఎస్‌ పీడీ రోజ్‌మాండ్‌ను ఆదేశించారు. అనంతరం మునిసిపల్‌ కార్యాలయంలో పద్మ విలేకరులతో మాట్లాడారు. భార్యను ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించడంతో పాటు ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి పలువురికి పంపడం హేయమైన చర్య అన్నారు. అదే క్రమంలో వైజాగ్‌లో దివ్యాంగురాలిపై జరిగిన ఘటనను గుర్తు చేస్తూ.. నిందితులు ఏ పార్టీ వారైనా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళా కమిషన్‌ సభ్యురాలు గజ్జెల లక్ష్మి, కమిషన్‌ డైరెక్టర్‌ కె.సూయజ్, ఆర్డీవో చైత్ర వర్షిణి, మున్సిపల్‌ కమిషనర్‌ రమేష్‌ బాబు, చైర్‌పర్సన్‌  వెంకటరమణమ్మ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు