డిండి ఎత్తిపోతలపై ఎన్జీటీకి 

3 Oct, 2021 04:10 IST|Sakshi

తెలంగాణ అక్రమంగా చేపట్టిన ఎత్తిపోతలపై ఏపీ రిట్‌ పిటిషన్‌  

ప్రతివాదులుగా కేంద్ర జల్‌శక్తి, అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శులు.. 

నేషనల్‌ బోర్డు ఫర్‌ వైల్డ్‌లైఫ్‌ చైర్మన్, కృష్ణా బోర్డు, తెలంగాణ సర్కార్‌ కూడా 

పర్యావరణం, పులుల అభయారణ్యానికి విఘాతం కల్పిస్తున్న ప్రాజెక్టును నిలిపేయాలని విజ్ఞప్తి 

దిగువ రాష్ట్రమైన ఏపీ ప్రజల జీవనోపాధిని పరిరక్షించాలి 

రిట్‌ పిటిషన్‌ను సోమవారం విచారించనున్న ఎన్జీటీ 

సాక్షి, అమరావతి: పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి, తెలంగాణ సర్కార్‌ అక్రమంగా చేపట్టిన డిండి ఎత్తిపోతల పథకం పనులను నిలుపుదల చేయాలని కోరుతూ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై బెంచ్‌లో రాష్ట్ర ప్రభుత్వం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ ప్రాజెక్టువల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని..  దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రజల జీవనోపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తంచేసింది. పర్యావరణ అనుమతిలేకుండా చేపట్టిన ఈ ఎత్తిపోతల  పనులపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు, నేషనల్‌ బోర్డు ఫర్‌ వైల్డ్‌లైఫ్‌ చైర్మన్‌ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం కన్పించలేదని పేర్కొంది.

విభజన చట్టాన్ని ఉల్లంఘించి.. కృష్ణాబోర్డు, కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదంలేకుండా చేపట్టిన ఈ పథకాన్ని నిలుపుదల చేయాలని కేంద్ర జల్‌శక్తి శాఖ, కృష్ణా బోర్డులను కోరినా ఫలితం లేకపోయిందని ఎన్జీటీకి వివరించింది. ఈ రిట్‌ పిటిషన్‌లో కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి, కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి, నేషనల్‌ బోర్డు ఫర్‌ వైల్డ్‌లైఫ్‌ చైర్మన్, కృష్ణా బోర్డు ఛైర్మన్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను ప్రతివాదులుగా చేర్చింది. తక్షణమే ఈ పనులను నిలుపుదల చేయించి.. ఏపీ హక్కులను పరిరక్షించడంతోపాటు ప్రజల జీవనోపాధికి విఘాతం కలగకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ రిట్‌ పిటిషన్‌పై సోమవారం ఎన్జీటీ విచారించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్జీటీలో దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌లో జలవనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు పేర్కొన్న ప్రధానాంశాలు ఇవీ.. 

► ఈఐఏ (పర్యావరణ ప్రభావ అంచనా)–2006 నోటిఫికేషన్‌ ప్రకారం పది వేల ఎకరాల కంటే ఎక్కువగా కొత్త ఆయకట్టుకు నీళ్లందించే ప్రాజెక్టులకు ముందస్తుగా పర్యావరణ అనుమతి తీసుకుని పనులు చేపట్టాలి. 
► ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014 ప్రకారం.. కృష్ణా నదిపై కొత్తగా ఏ ప్రాజెక్టును చేపట్టాలన్నా.. కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. 
► కానీ.. తెలంగాణ సర్కార్‌ అవేమీ లేకుండానే శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 30 టీఎంసీలు తరలించి.. 3,60,680 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా డిండి పనులను 2015, జూన్‌ 11న చేపట్టింది. 
► దీనిపై పలుమార్లు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు ఫిర్యాదు చేశాం. ఈ పనులవల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని చెప్పాం. డిండి ఎత్తిపోతల పనులు చేసే ప్రదేశం పులుల అభయారణ్యంలో ఉండటంవల్ల.. వాటి ఉనికికి ప్రమాదం వాటిల్లుతుందని నేషనల్‌ బోర్డు ఫర్‌ వైల్డ్‌లైఫ్‌ చైర్మన్‌కు ఫిర్యాదు చేశాం. కానీ, ఎలాంటి స్పందన కన్పించలేదు. 
► ఈ ఎత్తిపోతలవల్ల ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ, నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని కృష్ణా బోర్డు, కేంద్ర జల్‌శక్తి శాఖకు అనేకసార్లు ఫిర్యాదు చేశాం. వాటిపైనా ఎలాంటి స్పందనలేదు. 
► ఈ పథకం పూర్తయితే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. తాగు, సాగునీటి కొరతకు.. వాతావరణ అసమతుల్యతకు దారితీస్తుంది. ప్రజలు జీవించే హక్కును దెబ్బతీస్తుంది.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు