కళ్యాణమస్తు, షాదీ తోఫా: వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌.. 1వ తేదీ నుంచి అమలు

30 Sep, 2022 17:40 IST|Sakshi

సాక్షి, విజయవాడ:  పిల్లల చదువును ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నివారించడం మాత్రమే కాదు.. పాఠశాలల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాపౌట్ రేట్‌ను గణనీయంగా తగ్గించడం లక్ష్యాలుగా ‘‘వైఎస్సార్ కళ్యాణమస్తు’’, ‘‘వైఎస్సార్ షాదీ తోఫా’’ పథకాలకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఈ పథకాలు అమలులోకి రానుండగా.. వీటికి సంబంధించిన వెబ్ సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒకరోజు ముందుగానే.. అంటే సెప్టెంబర్‌ 30న  లాంఛనంగా ప్రారం‍భించారు.

‘వైఎస్సార్ కళ్యాణమస్తు’’, ‘‘వైఎస్సార్ షాదీ తోఫా’’ పథకాలు దరఖాస్తు చేసుకునే వధూవరులిరువురుకీ టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలి. చదువును ప్రొత్సహించేందుకే ఈ నిబంధనను తప్పనిసరిని చేసింది ప్రభుత్వం. ఇక వివాహ తేదీ నాటికి వధువు వయస్సు 18, వరుడి వయస్సు 21 ఏళ్లు ఖచ్చితంగా నిండాలని ప్రభుత్వం తెలిపింది. 

ఆర్థికసాయం భారీగా పెంపు
గత ప్రభుత్వంతో పోలిస్తే.. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అర్హులకు ఆర్థిక సాయం భారీగా పెంచింది. వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తులో భాగంగా ఎస్సీలకు రూ.1,00,000, ఎస్సీల కులాంతర వివాహాలకు రూ.1,20,000, ఎస్టీలకు రూ.1,00,000, ఎస్టీల కులాంతర వివాహాలకు రూ.1,20,000, బీసీలకు రూ.50,000, బీసీల కులాంతర వివాహాలకు రూ.75,000, వైఎస్సార్‌ షాదీ తోఫా కింద..  ముస్లిం మైనారిటీలకు రూ.1,00,000, దివ్యాంగుల వివాహాలకు రూ.1,50,000, వీళ్లకేగాక భవన నిర్మాణ కార్మికుల వివాహాలకు రూ.40,000 ల ఆర్థిక సాయాన్ని పెళ్లి కానుకగా అందించనుంది.

మరిన్ని వార్తలు