నిజాయితీకి నిలువెత్తు రూపమై.. రూ.4 లక్షల విలువైన నగను..

30 Aug, 2022 10:22 IST|Sakshi
మల్లేశ్వరరావు దంపతులను సత్కరించి నగదు బహుమతి అందజేస్తున్న మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నానిరాజు దంపతులు

సాక్షి, అమలాపురం: స్థానిక భూపయ్య అగ్రహారం మహానంద అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా ఉంటున్న మల్లేశ్వరరావు దంపతులు నిజాయితీకి నిలువెత్తు రూపంగా నిలిచారు. తమ వద్దకు బ్యాగ్‌లో ఉన్న రూ.4 లక్షల విలువైన బంగారు నగను సంబంధిత వ్యక్తులకు అందజేసి నిజాయితీ చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలివీ.. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రుద్రరాజు నానిరాజు కుమార్తె డాక్టర్‌ ఆర్‌.సాయిశిల్ప పట్టణంలో సాయి సంజీవిని ఆస్పత్రి నిర్వహిస్తున్నారు.

మాసిన తన వస్త్రాలను ఉతికి ఇస్త్రీ చేసేందుకు రజకులైన మల్లేశ్వరరావు దంపతులకు ఆమె ఇస్తారు. ఎప్పటిలాగే రెండు రోజుల కిందట డాక్టర్‌ సాయిశిల్ప మాసిన వస్త్రాలను ఓ బ్యాగ్‌లో ఉంచి మల్లేశ్వరరావు దంపతులకు ఇచ్చారు. అప్పటికే ఆ బ్యాగ్‌తో ప్రయాణించి వచ్చిన ఆమె తనకు చెందిన రూ.4 లక్షల విలువైన బంగారు నగ ఉన్న కవర్‌ను అదే బ్యాగ్‌లో మరచిపోయారు. మాసిన వస్త్రాలను అదే బ్యాగ్‌లో ఉంచి మల్లేశ్వరరావు దంపతులకు ఇచ్చారు.

ఈలోగా బంగారు నగ కనిపించకపోవడంతో డాక్టర్‌ సాయిశిల్ప కుటుంబీకులు మధనపడుతున్నారు. ఇంతలో ఆ బ్యాగ్‌లో మాసిన వస్త్రాలను ఉతికేందుకు బయటకు తీసిన మల్లేశ్వరరావు దంపతులకు ఆ బంగారు నగ కనిపించింది. దీంతో ఆ బంగారు నగను ఆ దంపతులు నిజాయితీగా తీసుకువెళ్లి డాక్టర్‌ సాయిశిల్పకు అందజేశారు. వారి నిజాయితీకి మెచ్చిన సాయిశిల్ప తల్లిదండ్రులైన మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రుద్రరాజు నానిరాజు, ఉషాకుమారి దంపతులు.. మల్లేశ్వరరావు దంపతులను సోమవారం సత్కరించారు. వారికి రూ.5 వేల నగదు బహుమతి అందజేశారు. మల్లేశ్వరరావు దంపతుల నిజాయితీని భూపయ్య అగ్రహారం ప్రజలు అభినందించారు. 

చదవండి: (చెవిలో చెబితే.. కోరికలు తీర్చే స్వామి)

మరిన్ని వార్తలు