Vijayawada: 9 లక్షల డబ్బు, బంగారు నగలతో పరార్‌!

16 Dec, 2021 07:44 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న ఈస్ట్‌జోన్‌ డీసీపీ హర్షవర్థన్‌ రాజు

రూ.9.72 లక్షల నగదు, 6.7 గ్రాముల బంగారం స్వాధీనం

చోరీ కేసులో నిందితుల అరెస్ట్‌

విలేకరుల సమావేశంలో డీసీపీ హర్షవర్థన్‌రాజు

విజయవాడ: పటమట పంటకాలువ రోడ్డులోని శ్రీ లక్ష్మీ అపార్ట్‌మెంట్‌లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 11వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.9.72 లక్షల నగదు, 6.7 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఈస్ట్‌ జోన్‌ డీసీపీ వి.హర్షవర్థన్‌రాజు సూర్యారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మార్కండేయ కాలనీకి చెందిన వేముల శ్రీను గత కొన్నేళ్లుగా ఇదే అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తుండగా అతని భార్య లక్ష్మి చోరీ జరిగిన ఫ్లాట్‌లో పనిమనిషిగా  చేస్తోందని డీసీపీ తెలిపారు. ఆ ఫ్లాట్‌ కుటుంబ సభ్యులు ఈ నెల 10వ తేదీన హైదరాబాద్‌ వెళ్లారన్న విషయం తెలిసిన నిందితుడు శ్రీను 11వ తేదీన భార్యను పుట్టింటికి పంపి అదే రోజు రాత్రి ఇనుప రాడ్డుతో ఫ్లాట్‌ తాళం పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు తెలిపారు.

చోరీ చేసిన సొత్తులో రూ.4.72 లక్షలు, కొన్ని బంగారు ఆభరణాలను శ్రీను తన వద్ద ఉంచుకుని మిగిలిన రూ.5 లక్షల నగదును గుంటూరు జిల్లా పెదకాకానిలో ఉంటున్న అతని అన్నయ్య వేముల మహేష్‌ వద్ద దాచినట్లు చెప్పారు. చోరీ జరిగిన నాటి నుంచి శ్రీను అపార్ట్‌మెంట్‌ వద్ద లేకపోవడంతో అతని కోసం గాలించామన్నారు. బుధవారం ఒన్‌టౌన్‌ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్ద దొంగిలించిన సొత్తును విక్రయించే ప్రయత్నం చేస్తుండగా శ్రీనును అదుపులోకి తీసుకుని విచారించామని, నిందితుడు నేరం అంగీకరించడంతో అతని వద్దనున్న నగదుతో పాటు అతని అన్నయ్య వద్ద దాచిన నగదును, బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ కేసును స్వల్ప కాలంలోనే ఛేదించినట్లు డీసీపీ తెలిపారు. సమావేశంలో సీసీఎస్‌ ఏడీసీపీ కె.శ్రీనివాసరావు, ఏసీపీ సి.హెచ్‌.శ్రీనివాసరావు, సెంట్రల్‌ ఏసీపీ ఎస్‌.ఖాదర్‌బాషా పాల్గొన్నారు.  

చదవండి: అదిరిపోయే స్కీమ్‌! ఈ సేవింగ్‌ స్కీమ్‌లో పొదుపు చేసిన సొమ్ము 124 నెలల్లో రెట్టింపవుతుంది!

మరిన్ని వార్తలు