ఇంధన పొదుపుపై  దృష్టి పెట్టండి

19 Jul, 2021 04:21 IST|Sakshi

సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్‌

సాక్షి, అమరావతి: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం ద్వారా ఇంధన పొదుపుతో పాటు పర్యావరణానికి మేలు జరిగే చర్యలు తీసుకోవాలని ఇంధన శాఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఆదిత్యనాథ్‌ దాస్‌ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీఈఈ అంచనా ప్రకారం రాష్ట్రంలో 67,500 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌కు డిమాండ్‌ ఉండగా.. అందులో 16,875 మిలియన్‌ యూనిట్ల వరకు ఆదా చేసుకునే వెసులుబాటు ఉందన్నారు.

రాష్ట్రంలో వ్యవసాయ డీఎస్‌ఎం, గ్రామ పంచాయతీల్లోని వీధి లైట్లు, కేంద్ర ప్రభుత్వ పథకాలు పీఏటీ, ఉజాలా తదితరాల ద్వారా 2,932 మిలియన్‌ యూనిట్లను ఆదా చేయగలిగామని పేర్కొన్నారు. దీని వల్ల రూ.2,014 కోట్ల ఆర్థిక భారం తగ్గిందని చెప్పారు. మరో 14,000 మిలియన్‌ యూనిట్లు ఆదా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. దీనికి తగినట్లుగా ఇంధన శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు.

అందరికీ అందుబాటు ధరల్లో విద్యుత్‌ను అందించాలనేది సీఎం వైఎస్‌ జగన్‌ లక్ష్యమని చెప్పారు. 2031 నాటికి దేశ ఇంధన  రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులొచ్చే అవకాశముందని, ఇందులో అత్యధిక భాగం ఏపీకి వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు