నాణ్యమైన సేవల కోసం.. పనివేళల్లో సెల్‌ఫోన్‌ కట్‌!

29 Sep, 2022 04:39 IST|Sakshi

అక్టోబర్‌ 1 నుంచి పనివేళల్లో సెల్‌ఫోన్‌ వాడొద్దంటూ ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ ఆదేశాలు

సాక్షి, అమరావతి: విద్యుత్‌ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు అదేపనిగా సెల్‌ఫోన్లు ఉపయోగిస్తూ పని గంటలు వృథా చేస్తున్నారని ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ జె.పద్మాజనార్ధనరెడ్డికి పలువురు ఉన్నతాధికారులు, వినియోగదారులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఎండీ.. కార్యాలయాల పని వేళల్లో సెల్‌ఫోన్లు వాడొద్దంటూ ఉద్యోగులకు మెమో జారీ చేశారు. ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏపీసీపీడీసీఎల్‌ కార్పొరేట్‌ కార్యాలయంతో పాటు జిల్లా స్థాయిలో ఆపరేషన్‌ సర్కిల్‌ కార్యాలయాల్లోనూ ఇవే నిబంధనలు అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేయాలని సూపరింటెండెంట్‌ ఇంజినీర్లను ఆదేశించారు. ఇటీవల ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడిన అంశాలను.. వాయిస్‌ రికార్డ్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేశారు. దీనిపై సీఎండీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇలాంటి చర్యలతో పాటు కార్యాలయాల పనివేళల్లో సెల్‌ఫోన్లను విపరీతంగా ఉపయోగించడం వల్ల సంస్థ పనితీరుకు, అంతర్గత భద్రతకు, గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదముందని సీఎండీ భావించారు.  అక్టోబరు 1 నుంచి పనివేళల్లో సెల్‌ఫోన్‌ వాడకూడదనే నిబంధనను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

ఆ రోజు నుంచి ఉద్యోగులు కార్యాలయానికి రాగానే తమ ఫోన్లను సెక్యూరిటీ వద్ద డిపాజిట్‌ చేసి రసీదు తీసుకోవాలి. భోజన విరామ సమయంలో ఫోన్లు వాడుకునే అవకాశమిచ్చారు. అత్యవసరంగా మాట్లాడాల్సి వస్తే.. ఉన్నతాధికారి ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. 

మరిన్ని వార్తలు