సరికొత్త సాంకేతికత.. ఇక ఫ్యూజులు కాలవు!

19 Aug, 2022 11:54 IST|Sakshi

విద్యుత్‌ సమస్యలకు ఎంసీసీబీతో చెక్‌

నూతన సాంకేతికతను ప్రవేశ పెడుతున్న ఏపీసీపీడీసీఎల్‌

ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఫ్యూజులు కాలిపోయే పరిస్థితి నుంచి విముక్తి

తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి విజయవాడలో ఏర్పాటు

తొలివిడతలో 40 వేల ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద

సాక్షి, అమరావతి: సీరియస్‌గా టీవీ సీరియల్‌ చూస్తున్నప్పుడు కరెంటు పోతే వచ్చే అసహనం అంతా ఇంతా కాదు. గాలిలేదు.. వానలేదు.. కరెంటెందుకు పోయిందోననుకుంటూ వెంటనే పక్కింటివాళ్లకు ఉందోలేదో చూస్తుంటాం. తీరా వీధిలో కొందరికి ఉండి మనతోపాటు కొందరికి లేదని గుర్తించాక అప్పుడు అర్థమవుతుంది.. ఫ్యూజు కాలిపోయిందని. వెంటనే కరెంట్‌ ఆఫీసుకు ఫోన్‌చేస్తే విద్యుత్‌ సిబ్బంది వచ్చి ఫ్యూజ్‌ ఏ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద పోయిందో పరిశీలిస్తారు. కానీ ఎందుకు కాలిపోయిందో తెలియాలంటే మాత్రం ఆ లైన్లన్నీ వెదకాలి. దానికి చాలా సమయం పడుతుంది.

ఇలాంటి ఇబ్బందులను తప్పించేందుకు, ప్రమాదాలను అరికట్టేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌ మధ్య ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్‌) సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే మినియేచర్‌ కాంటాక్ట్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌ (ఎంసీసీబీ). విజయవాడలో ఎంసీసీబీల ఏర్పాటును మొదలుపెట్టారు. ప్రస్తుతం 40 వేల ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద వీటిని ఏర్పాటు చేస్తామని, దశలవారీగా డిస్కం పరిధిలోని అన్ని జిల్లాల్లో ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ఏర్పాటు చేస్తామని ఏపీసీపీడీసీఎల్‌ చెబుతోంది. 

నాణ్యత, రక్షణ 
విజయవాడలోని ముఖ్యకూడళ్లలో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల ఫ్యూజు బాక్సుల స్థానంలో రెండువైపుల ఎంసీసీబీ ఉండే కేబుళ్లు అమర్చారు. విద్యుత్‌ సరఫరాలో సమస్య ఏర్పడినప్పుడు ఇవి యాక్టివేట్‌ అవుతాయి. సమస్య ఉన్న లైనుకు మాత్రమే విద్యుత్‌ సరఫరా నిలిపేస్తాయి. లైనులో ఎక్కడ సమస్య వచ్చిందనే విషయాన్ని కూడా సూచిస్తాయి. దీంతో వెంటనే సమస్యను పరిష్కరించి విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించేందుకు అవకాశం కలుగుతుంది. మరోవైపు ప్రస్తుతం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద ప్రమాదాల నివారణకు రక్షణ కంచె ఏర్పాటు చేయడం ఒక్కటే పరిష్కారమార్గంగా ఉంది. ఆ కంచె కూడా వివిధ కారణాల వల్ల పాడైపోతోంది. అది గమనించకుండా అటు వెళ్లిన మనుషులు, మూగజీవాలు మృత్యువాత పడాల్సి వస్తోంది. ఎంసీసీబీ వ్యవస్థలో రెండువైపులా ఇన్సులేటెడ్‌ కేబుళ్లు ఉండటం వల్ల ప్రమాదాలకు అవకాశం ఉండదు.

మేమే ముందు
ఒక్కో ఎంసీసీబీకి దాదాపు రూ.10 వేలు ఖర్చవుతోంది. వీటిని అతి తక్కువ ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు రక్షణ లభించడంతోపాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయడానికి వీలు కలుగుతుంది. దీంతో లైన్‌లాస్‌ తగ్గి అంతిమంగా డిస్కంకు, వినియోగదారులకు ఆర్థిక  ప్రయోజనం చేకూరుతుంది. అదీగాకుండా తుప్పుపట్టిన ఇనుప ఫ్యూజుబాక్సుల స్థానంలో ఎంసీసీబీతో కూడిన ట్రాన్ఫ్‌ఫార్మర్లు చూడ్డానికి బాగుంటాయి. నగర సుందరీకరణలో ఇవి కూడా భాగమవుతున్నాయి. ఏపీ, తెలంగాణల్లో ఎంసీసీబీలను మా డిస్కంలోనే తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చాం.
 – జె.పద్మాజనార్ధనరెడ్డి, సీఎండీ, ఏపీసీపీడీసీఎల్‌

మరిన్ని వార్తలు