ఐదేళ్ల ‘ట్రూ అప్‌’పై విచారణ

2 Nov, 2021 04:16 IST|Sakshi

వివిధ వర్గాల అభిప్రాయాలు సేకరించిన ఏపీఈఆర్‌సీ

సాక్షి, అమరావతి: ఇంధన సర్దుబాటు (ట్రూ అప్‌) చార్జీల వసూలు సబబేనని కొందరు, ఆ భారం ప్రజలపై వేయరాదని మరికొందరు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి సూచించారు. రాష్ట్ర ప్రజలపై సెప్టెంబర్‌ నెల విద్యుత్‌ బిల్లుల నుంచి మొదలుపెట్టిన ఐదేళ్ల ఇంధన సర్దుబాటు చార్జీలపై ఏపీఈఆర్‌సీ సోమవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ నిర్వహించింది. 2014–15 నుంచి 2018–19 వరకు విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ నిర్వహణ, ఆదాయ అవసరాలు, వాస్తవ ఖర్చుల ఆధారంగా రూ.7,224 కోట్లను అదనపు వ్యయంగా నిర్ధారించాలని ఆంధ్రప్రదేశ్‌ తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌), ఆంధ్రప్రదేశ్‌ దక్షిణప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్‌పీడీసీఎల్‌) మండలిని కోరాయి. దీన్లో రూ.3,669 కోట్ల వసూలుకు అనుమతి ఇస్తూ ఏపీఈఆర్‌సీ ఆగస్టు 27న ఉత్తర్వులిచ్చింది.

ట్రూ అప్‌ చార్జీలపై ప్రజలకు సరైన సమాచారం ఇవ్వలేదని, అవగాహన కల్పించలేదని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను సుమోటోగా తీసుకున్న ఏపీఈఆర్‌సీ ఆగస్టు 27న ఇచ్చిన ఉత్తర్వులను నిలిపేసి, ట్రూఅప్‌ చార్జీలపై ప్రజల అభిప్రాయాలు మరోసారి సేకరించాలని నిర్ణయించింది. గతనెల 19న నిర్వహించిన విచారణలో 86 మంది  అభిప్రాయాలు వెల్లడించారు. సోమవారం ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌  నాగార్జునరెడ్డి పారిశ్రామిక, వాణిజ్య, ఉద్యోగసంఘాల ప్రతినిధులు, వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు సేకరించారు. 45 మంది విచారణకు హాజరుకాగా 15 మంది తమ అభిప్రాయాలు తెలిపారు. ట్రూ అప్‌ చార్జీలు విధించడాన్ని కొందరు సమర్థించారు.  విచారణలో ఏపీఈఆర్‌సీ సభ్యులు రాజగోపాలరెడ్డి, ఠాకూర్‌ రామాసింగ్, కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు