ప్రైవేట్‌ విద్యుత్తు సంస్థలకు ఏపీఈఆర్‌సీ షాక్‌! 

25 Jul, 2020 05:13 IST|Sakshi

ల్యాంకో, స్పెక్ట్రం, శ్రీవత్స పిటిషన్లు తిరస్కరణ

కమిషన్‌ తీర్పుతో రూ.200 కోట్లు ఆదా

సాక్షి, అమరావతి: ప్రజా ధనాన్ని పరిరక్షిస్తూ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) మరో కీలక తీర్పు వెలువరించింది. పెరిగిన గ్యాస్‌ ధరల ఆధారంగా రెండేళ్ల కాలానికి అదనపు చర వ్యయం (వేరియబుల్‌ కాస్ట్‌) ఇవ్వాలంటూ ప్రైవేట్‌ విద్యుత్‌ సంస్థలు  ల్యాంకో, స్పెక్ట్రం, శ్రీవత్సవ వేసిన పిటిషన్‌ను కమిషన్‌ తోసిపుచ్చింది. ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి నేతృత్వంలో సభ్యులు పి.రాజగోపాల్‌రెడ్డి, ఠాకూర్‌ రామ్‌సింగ్‌ వెలువరించిన తీర్పును కమిషన్‌ వర్గాలు శుక్రవారం మీడియాకు వెల్లడించాయి.  

కమిషన్‌ ఆమోదం లేకున్నా.. 
► 2018–19, 2019–20లో పెరిగిన గ్యాస్‌ ధరల ఆధారంగా అదనపు చర వ్యయం ఇవ్వాలని విద్యుదుత్పత్తి సంస్థలు కమిషన్‌ను ఆశ్రయించాయి. ప్రైవేట్‌ సంస్థల వాదనపై డిస్కమ్‌లు, విద్యుత్‌ రంగ నిపుణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  వాస్తవానికి ల్యాంకో, స్పెక్ట్రం విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు 2016లో, శ్రీవత్సవ పీపీఏ గడువు 2018లోనే ముగిసినా మళ్లీ కుదుర్చుకోవాలని ఆ సంస్థలు పట్టుబట్టాయి. కమిషన్‌ నుంచి దీనికి ఆమోదం లేకున్నా గత సర్కారు స్వల్పకాలిక పద్ధతిలో వాటి నుంచి విద్యుత్‌ తీసుకుంది.  
► ల్యాంకోకు యూనిట్‌కు రూ.3.29, మిగతా వాటికి యూనిట్‌కు రూ. 3.31 చొప్పున చెల్లించగా కేవలం కొన్ని నెలలకే తీసుకునే ఈ విద్యుత్‌కు నిర్ణయించిన ధరలే వర్తిస్తాయని విద్యుత్‌ చట్టాలు పేర్కొంటున్నాయి.  రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ ఉండటం, మార్కెట్లో అంతకన్నా చౌకగా లభిస్తుండటంతో ఈ ఏడాది కమిషన్‌ ప్రైవేట్‌ గ్యాస్‌ పవర్‌ను అనుమతించలేదు. కోవిడ్‌ కాలంలో చౌకగా విద్యుత్‌ తీసుకోవడానికి కేవలం ఆరు నెలలకే కమిషన్‌ ఒప్పుకుంది. 

అదనపు చర వ్యయంతో భారీ భారం... 
► 2018–19, 2019–20లో గ్యాస్‌ ధరలు స్వల్పంగా పెరగడంతో ఆ మేరకు ఇవ్వాలని ప్రైవేట్‌ సంస్థలు కోరాయి. ల్యాంకో విద్యుదుత్పత్తి సామర్థ్యం 355 మెగావాట్లు కాగా, స్పెక్ట్రం 208 మెగావాట్లు, శ్రీవత్సవ 17 మెగావాట్లుగా ఉంది. వీటి నుంచి రెండేళ్లలో సుమారు 4 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను డిస్కమ్‌లు తీసుకున్నాయి. ప్రైవేట్‌ సంస్థలు కోరినట్లుగా అదనపు చర వ్యయం చెల్లిస్తే డిస్కమ్‌లపై రూ.200 కోట్ల అదనపు భారం పడుతుంది. స్వల్పకాలిక పీపీఏలకూ అదనంగా ఎలాంటి ఖర్చులు అడిగే హక్కు లేదన్న డిస్కమ్‌ల వాదనతో కమిషన్‌ ఏకీభవించింది. నిపుణుల వాదనలూ పరిగణలోకి తీసుకుంటూ పిటిషనర్లైన ప్రైవేట్‌ విద్యుదుత్పత్తి సంస్థల వాదనను తోసిపుచ్చింది. 

మరిన్ని వార్తలు