Jagananna Vidya Kanuka: అసత్య ప్రచారాన్ని ఖండించిన ఏపీ ఫ్యాక్ట్‌చెక్‌

6 Oct, 2021 07:56 IST|Sakshi

జగనన్న విద్యాకానుక ‘డిక్షనరీ’పై అసత్య ప్రచారాలు

దాన్లోని ‘గాడ్‌’ అనే పదానికి అర్థం మార్చేశారంటూ విషం

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తున్న టీడీపీ గ్యాంగ్‌

దాంట్లో తామూ భాగం పంచుకుంటున్న ఎల్లో మీడియా

ఈ విషప్రచారంలో వాస్తవాలు తెలిపే ‘ఫ్యాక్ట్‌ చెక్‌’ ఇదిగో... 

సాక్షి, అమరావతి: ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ!!. దీనికో చరిత్ర ఉంది. ఇంగ్లీషు పదాల అర్థం తెలుసుకోవటానికి చాలామంది ఆశ్రయించేది దీన్నే. ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ ముద్రిస్తుంది కనక దానికంత విశ్వసనీయత. అదే డిక్షనరీని ఇపుడు రాష్ట్ర ప్రభుత్వం  జగనన్న విద్యాకానుక కింద విద్యార్థులకు ఇస్తున్న కిట్లలో భాగంగా సరఫరా చేసింది. విద్యార్థులకైతే ఈ డిక్షనరీ బాగానే నచ్చింది. కానీ టీడీపీ, దాని అనుకూల మీడియా, ఆ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్తలకు మాత్రం ఇది నచ్చలేదు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై చేయడానికి ఎలాంటి విమర్శలూ లేకపోవటంతో దాదాపు 37 ఏళ్లుగా ముద్రిస్తున్న ఈ డిక్షనరీలోని ఓ పదాన్ని రాజకీయం చేయడానికి సంకల్పించింది టీడీపీ బ్యాచ్‌. ఆ పదానికి అర్థాన్ని జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కావాలనే అలా మార్చేసిందంటూ దానికి మతం రంగు అల్లే ప్రయత్నం చేస్తోంది. సోషల్‌ మీడియాలో ఎల్లో గ్యాంగ్‌ విపరీతంగా వైరల్‌ చేస్తున్న ఆ పదమేంటి? దానికి అర్థమేంటి? అసలు డిక్షనరీలో ఏముంది? నిజంగా ప్రభుత్వం సరఫరా చేసిన డిక్షనరీలో అర్థం మారిందా? నిజానిజాలేంటి? ఇదిగో... మీ కోసమే ఈ సాక్షి... ‘ఫ్యాక్ట్‌చెక్‌’. 

అవి మార్కెట్లోని డిక్షనరీలే.... 
అత్యంత ప్రామాణికమయిన తెలుగు–ఇంగ్లీష్‌ ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీని కొనుగోలు చేసి ఉచితంగా విద్యార్థులకు విద్యా కానుకలో భాగంగా అందించాం. ఇందులోని పదాల నిర్వచనాలు ఆక్స్‌ఫర్డ్‌ సంస్థ నిర్ణయించినవే. మార్కెట్‌లో లభించే ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలనే బల్క్‌గా కొని విద్యార్థులకు అందించాం. దాన్లోని అంశాలను మార్చటం వంటివేమీ మేం చెయ్యలేదు. చెయ్యలేం కూడా. బయట ఉన్న ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలోని అంశాలే వీటిలోనూ యథాతథంగా ఉంటాయి.  
– వెట్రి సెల్వి, ఎస్పీడీ, సమగ్ర శిక్ష, ఏపీ 

ఇదీ ఆరోపణ.... 
జగనన్న విద్యాకానుక పథకం కింద ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులకు ఉచితంగా అందిస్తున్న ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో గాడ్‌ అనే పదానికి ‘ఈ విశ్వాన్ని సృష్టించాడని ఇస్లాము, క్రైస్తవ మరియు యూదా మతస్తులు నమ్మి ప్రార్థించే దైవం, గాడ్‌.’ అని ఉంది.‘గాడ్‌పేరెంట్‌’ అనే పదానికి ‘పిల్లలను పెంచి పెద్దచేసి చదివించి వారిని క్రీస్తు మతంలో దీక్షితులను చేసే వ్యక్తి, ధర్మపిత’ అని ఉంది. అయితే ప్రభుత్వం తాను పంచుతున్న ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో కావాలనే ఇలా మార్చేసిందని, క్రిస్టియానిటీని పిల్లల్లో ప్రోత్సహించడానికే ఇలా చేశారంటూ ఎల్లో మీడియా, టీడీపీ గ్యాంగ్‌ విపరీతంగా వాపోతోంది. టీడీపీ నేతలు, సానుభూతి పరులు దీనిపై వీడియోలు చేస్తూ... డిక్షనరీలోని పదాన్ని చూపిస్తూ... హిందూ వ్యతిరేకతను రెచ్చగొట్టి, దాన్ని వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి ఆపాదించే పనిలో పడ్డారు. 

‘ఫ్యాక్ట్‌ చెక్‌’లో తేలినదేంటి? 
ఫ్యాక్ట్‌ చెక్‌... అంటే నిజానిజాల తనిఖీ. దీన్లో ఏం తేలిందో ఓ సారి చూద్దాం. మొదట అందరికీ వచ్చే సందేహం ఆ డిక్షనరీలో అలా ఉందా? అనేది. నిజమే... ఆ డిక్షనరీలో అలానే ఉంది. కాకపోతే అది స్కూలు పిల్లల కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తయారు చేసిందేమీ కాదు. మార్కెట్లో దొరికే ప్రతి ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలోనూ అలానే ఉంది. నిజానికి ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ 1984 ఫిబ్రవరి నుంచీ ముద్రిస్తోంది. ఇంగ్లీషు– తెలుగు డిక్షనరీ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచీ దాన్లో ‘గాడ్‌’, ‘గాడ్‌ పేరెంట్‌’ అనే పదాలకు ఇదే అర్థం ఉంది. మార్కెట్లో లభ్యమవుతున్న డిక్షనరీలను బల్క్‌గా కొనుగోలు చేసి ప్రభుత్వం పిల్లలకు అందించింది.

ప్రభుత్వంపై దుష్ప్రచారానికి ఏమీ దొరకని ఎల్లో బ్యాచ్‌... వై.ఎస్‌.జగన్‌కు మతం రంగు పులిమి కాస్తయినా లబ్ధి పొందాలనే దురాలోచనతో ఈ దుర్మార్గానికి దిగింది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ఇమేజ్‌ను మరింత పెంచుతాయే తప్ప డ్యామేజీ చేయలేవన్నది తాజా ఉదంతంతో మరోసారి తేటతెల్లమయింది. దీనికి సంబంధించి రెండు డిక్షనరీలనూ చూపిస్తూ ప్రభుత్వం రూపొందించిన వీడియోను ఈ కింది లింక్‌ను క్లిక్‌ చేసి చూడొచ్చు. https://twitter.com/factcheckapgov?lang=en ‘ఎఫ్‌ఏసీటీసీహెచ్‌ఈసీకె.ఏపీ.జీఓవీ.ఐఎన్‌’ వెబ్‌సైట్లోనూ ఈ వీడియో లభ్యమవుతుంది. 

మరిన్ని వార్తలు