ఫీజుల దందా.. ఉన్నత విద్యాసంస్థలకు ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ హెచ్చరిక

19 Aug, 2022 08:33 IST|Sakshi

సాక్షి, అమరావతి: విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజు వసూలు చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలను ఏపీ ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ (ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ) హెచ్చరించింది. ఈ మేరకు అన్ని విద్యాసంస్థలకు కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీ, సీఈవో డాక్టర్‌ ఎన్‌.రాజశేఖర్‌రెడ్డి లేఖ రాశారు. 

యాజమాన్యాలు ఎక్కువ ఫీజు వసూలు చేయడం, సర్టిఫికెట్లు ఇవ్వడానికి డబ్బులు డిమాండ్‌ చేయడం సహా పలు అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి కమిషన్‌కు ఫిర్యాదులు అందాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి విద్యాసంస్థ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను అందరికి కనిపించేలా విద్యాసంస్థల్లోని నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలని సూచించారు. నిర్దేశించిన ఫీజు కన్నా అధికంగా వసూలు చేస్తే ఏపీహెచ్‌ఈఆర్‌ఎంసీ 2019, ఏపీ విద్యాసంస్థల (రెగ్యులేషన్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ ఆఫ్‌ క్యాపిటేషన్‌ ఫీ)–1983 చట్టాల్లోని నిబంధనలను అనుసరించి శిక్షార్హులవుతారని హెచ్చరించారు. 

కోర్సు పూర్తయిన విద్యార్థుల సర్టిఫికెట్లను విద్యాసంస్థలు అట్టిపెట్టుకోరాదని పేర్కొన్నారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థుల నుంచి ముందస్తుగా ఫీజు వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు. కమిషన్‌ ఆకస్మిక తనిఖీలు చేసి విద్యార్థులతో మాట్లాడుతుందని,  ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించినట్లు తమదృష్టికి వస్తే ఆయా విద్యాసంస్థలకు పెనాల్టీ విధించడంతోపాటు సమస్య తీవ్రతను బట్టి అఫిలియేషన్‌ను రద్దుచేయడానికి సిఫార్సు చేస్తామని ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: ఉపాధ్యాయ సంఘాలతో భేటీ.. మంత్రి బొత్స ఏమన్నారంటే?

మరిన్ని వార్తలు