అనంతపురం బీఈఎల్‌కు లైన్‌ క్లియర్‌

17 Sep, 2022 18:00 IST|Sakshi

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌) అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రక్షణరంగ ఉత్పత్తుల తయారీ యూనిట్‌కు లైన్‌ క్లియర్‌ అయింది. శుక్రవారం ఏపీఐఐసీ చైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీఐఐసీ బోర్డు సమావేశంలో ఎటువంటి పెనాల్టీలు లేకుండా యూనిట్‌ ఏర్పాటుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది.

రాడార్‌ టెస్ట్‌ బెడ్‌ ఫెసిలిటీ, రక్షణరంగ ఉత్పత్తుల (మిస్సైల్‌ మాన్యుఫాక్చరింగ్‌) యూనిట్‌ కోసం ఏపీఐఐసీ 2016లో 914 ఎకరాల భూమిని కేటాయించింది. గత ప్రభుత్వ హయాంలో అనుమతుల జాప్యం వల్ల యూనిట్‌ ఏర్పాటుకు అడుగులు ముందుకు పడలేదు. సకాలంలో యూనిట్‌ పనులు ప్రారంభించకపోవడంతో ఏపీఐఐసీ నోటీసులు జారీచేసింది. దీంతో బీఈఎల్‌ ప్రతినిధులు ఇటీవల ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యాన్ని కలిసి యూనిట్‌ ఏర్పాటుకు అన్ని అనుమతులు మంజూరు చేయాలని కోరారు.  భూములు కేటాయించినా పనులు మొదలుపెట్టని మరికొన్ని కంపెనీలకు సమయం ఇస్తూ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు గోవిందరెడ్డి చెప్పారు.

చదవండి: (కన్సల్టెన్సీ.. కంత్రీ.. జాబులు పేరుతో ‘టీడీపీ’ నేత దగా)

రూ.50 కోట్లలోపు పెట్టుబడి ఉన్న చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ప్రోత్సహించే విధంగా రాష్ట్రవ్యాప్తంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా తన సొంత జిల్లా అనంతపురం నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. బోర్డు సమావేశంలో ఎండీ సుబ్రమణ్యం ఏపీఐఐసీ మూడేళ్ల ప్రగతిని వివరించారు. గత మూడేళ్లలో కరోనా విపత్తు వచ్చినప్పటికీ 93 పారిశ్రామిక హబ్‌ల ఏర్పాటుకోసం రూ.1,708 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పారు.

మే 2019 నుంచి నేటివరకు 8,616 ఎకరాల భూమిని సమీకరించినట్లు తెలిపారు. గత మూడేళ్లలో 2,450 ఎంఎస్‌ఎంఈలకు భూమి కేటాయించినట్లు చెప్పారు. ఆ భూముల్లో 377 యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించాయన్నారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో జరిగిన భూ కేటాయింపుల ద్వారా రూ.52,161 కోట్ల పెట్టుబడులు, 2,31,309 మందికి ఉపాధి అవకాశాలు రానున్నాయని తెలిపారు.   

మరిన్ని వార్తలు