అప్పుడు వైఎస్సార్‌.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలో

7 Nov, 2022 09:50 IST|Sakshi

నిరుద్యోగులకు నీడగా ఏపీఐఐసీ

ఉమ్మడి జిల్లాలో వేలాదిగా  పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం

లక్షల మందికి  ఉద్యోగావకాశాల కల్పన

అప్పుడు వైఎస్సార్‌.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలో  క్రియాశీలకంగా ఏపీఐఐసీ

పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఆవిర్భవించి అర్ధ శతాబ్దం అయింది. ప్రభుత్వ యాజమాన్యంతో ప్రారంభమైన ఈ సంస్థ సుమారు 32 ఏళ్ల పాటు నిర్జీవంగా మారింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జవసత్వాలు పుంజుకుంది. జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నిరుద్యోగులకు అండదండగా నిలిచింది. వేలాది పరిశ్రమల స్థాపనకు పునాదులు వేసి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించింది. తిరిగి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రగతిని విస్తరిస్తోంది. 

ఆత్మకూరురూరల్‌(పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లా): అర్ధ శతాబ్దం క్రితం రెక్కలు తొడిగిన పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)కు గత ప్రభుత్వాలు రెక్కలు విరిచేశాయి. నిధులు.. విధులు లేక ఆ సంస్థ దాదాపు మూడు దశాబ్దాలకు పైగా చేతులు ముడుచుకుని కూర్చొంది. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఈ సంస్థ చేతినిండా పనితో తన కార్యకలాపాలను సమృద్ధిగా విస్తరించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నిరుద్యోగుల పాలిట వరంగా మారింది. 2004 నుంచి 2009 వరకు జిల్లాలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఏపీఐఐసీ వైఎస్సార్‌ మరణం తర్వాత మళ్లీ నిధులు, విధులు లేక చతికిలపడింది. తాజాగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ సంస్థకు మళ్లీ రెక్కలొచ్చాయి. పారిశ్రామిక ప్రగతికి తనవంతుగా భూసేకరణ చేయడంతో పాటు అందులో మౌలిక వసతులు కల్పించడంలో అహర్నిశలు శ్రమిస్తోంది.

మూడు పారిశ్రామికవాడల నుంచి..  
1973లో ఏపీఐఐసీ ప్రభుత్వ సంస్థగా ఆవిర్భవించింది. అయితే 2004 సంవత్సరానికి ముందు వరకు జిల్లాలో ఈ సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరులోని ఇండస్ట్రియల్‌ కాంప్లెక్స్, ఆటోనగర్, ఉడ్‌కాంప్లెక్స్, వెంకటాచలం పరిధిలోనే మాత్రమే పరిశ్రమల ఏర్పాటు చేయగలింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాంబట్టు, మేనకూరు, అంకులపాటూరు, పంటపాళెం, కొడవలూరు ప్రాంతాల్లో పారిశ్రామికవాడల విస్తరణకు ఏపీఐఐసీ శ్రీకారం చుట్టింది. ఉమ్మడి జిల్లాలో సుమారు 27 వేల ఎకరాల భూములను సేకరించి పరిశ్రమల స్థాపనకు అనువుగా మార్చింది. వేలాది మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అండగా నిలిచింది. లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించింది. 

కొత్త పరిశ్రమలకు ఊతంగా.. 
జిల్లా విభజతో మాంబట్టు, మేనకూరు, అంకులపాటూరు తదితర పారిశ్రామికవాడలు తిరుపతి జిల్లా పరిధిలోకి వెళ్లాయి. ఇక జిల్లాలో ఏపీఐఐసీకి మిగిలిన 4,107.97 ఎకరాల భూములను పారిశ్రామిక పార్కులుగా తీర్చిదిద్ది పారిశ్రామికవేత్తల అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు కూడా పూర్తి చేసింది. జిల్లాలోని ఏపీఐఐసీ పారిశ్రామికవాడల్లో ఇప్పటి వరకు 1883.59 ఎకరాల్లో 925 సంస్థలు రూ.9,422.93 కోట్ల పెట్టుబడితో వివిధ పరిశ్రమలను స్థాపించింది. తద్వారా 11,939 మంది నిరుద్యోగులకు ఆయా సంస్థల్లో ఉపాధి లభించింది. రెండో దశలో 648.64 ఎకరాల్లో 47 సంస్థలు రూ.6,661.02 కోట్ల పెట్టుబడితో స్థాపించబోయే పరిశ్రమల ద్వారా 10,188 మందికి ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మూడో దశలో 67.16 ఎకరాల్లో రూ.346.92 కోట్ల పెట్టుబడితో 44 సంస్థలు తాము ప్రారంభించబోయే పరిశ్రమల్లో 5,176 మందికి ఉపాధి కల్పించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాయి. 

నారంపేటలో వడివడిగా నిర్మాణాలు 
దివంగత పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మానసపుత్రికగా ప్రారంభమైన ఆత్మకూరు మండలం నారంపేట పారిశ్రామికవాడ నిర్మాణాలు ఆయన హఠాణ్మరణం కారణంగా కొంత కాలంగా పనులు మందగించాయి. తన అన్న ఆశయ సాధనే తొలి ప్రాధాన్యంగా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి నారంపేట పారిశ్రామికవాడపై దృష్టి సారించడంతో ఆగిపోయిన పనులు మళ్లీ జోరందుకున్నాయి. తొలి దశలో 2.30 కి.మీ. బీటీ రోడ్లు, 3.22 కి.మీ. సిమెంట్‌ డ్రెయినేజీ కాలువలు రూ.6.46 కోట్ల వ్యయంతో పూర్తి చేశారు. రెండో దశలో రూ.12.73 కోట్ల వ్యయంతో 6.70 కి.మీ. బీటీ రోడ్లు, 19.40 కి.మీ. సిమెంట్‌ కాలువలు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా ప్రస్తుతం 2.30 కి.మీట. బీటీ రోడ్లు, 4.60 కి.మీ. సిమెంటు కాలువలు నిర్మాణాలు పూర్తయ్యాయి.   

పారిశ్రామికవాడ ప్రత్యేకతలు 
173.67 ఎకరాలు విస్తీర్ణంలో చేపట్టిన నారంపేట ఎంఎస్‌ఎంఈ పార్కులో ప్లాస్టిక్‌ పార్కు, ఫర్నీచర్‌ పార్కుల ఏర్పాటుకు సంబంధించి భూముల కేటాయింపుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తం 337 ప్లాట్లు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ప్లాస్టిక్‌ ప్లార్కు ఏర్పాటుకు 36.23 ఎకరాలు, ఫర్నీచర్‌ పార్కుకు 25.56 ఎకరాలు కేటాయించారు. ఇందులో ఇప్పటికే పది ఎకరాల విస్తీర్ణాన్ని పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధం చేశారు.  గృహ నిర్మాణాల కోసం 5.49 ఎకరాలను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇవి కాకుండా పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగుల కోసం గృహ సముదాయం, మౌలిక వసతుల కోసం ప్రత్యేక భవనాలు, విశాలమైన గ్రీన్‌ పార్కు, 24 గంటలు అందుబాటులో ఉండేలా విద్యుత్, నీరు, వాహనాల పార్కింగ్‌ తదితర సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఏపీఐఐసీ అధికారులు చెబుతున్నారు.  

భవిష్యత్‌లో భారీగా విస్తరణ దిశగా..
బొడ్డువారిపాళెం పారిశ్రామికవాడలో మిథాని గ్రూపు సంస్థలు ఏపీఐఐసీ ద్వారా 110 ఎకరాలు సేకరించి రూ.4,500 కోట్ల పెట్టుబడితో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. క్రిబ్‌కో గ్రూపు సంస్థలు కూడా 289.81 ఎకరాల్లో రూ.560 కోట్ల పెట్టుబడితో 400 మందికి ఉపాధి కల్పించే మరో పరిశ్రమ ఏర్పాటుకు ముమ్మరంగా సన్నాహాలు జరుగుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పారిశ్రామికవాడలను విస్తరించిన ఏపీఐఐసీ తాజాగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొత్త పరిశ్రమల ఏర్పాటుకు పచ్చజెండా ఊపడంతో మరింత విస్తరించేందుకు చర్యలు చేపట్టింది.

రామాయపట్నం ఇండస్ట్రియల్‌ హబ్‌ ద్వారా కందుకూరు డివిజన్‌ సమీపంలో రావూరు, చేవూరు గ్రామాల పరిధిలో 3,773.47 ఎకరాల్లో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రామాయపట్నం పోర్టుకు అనుసంధానం చేస్తూ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు స్థాపించాలని నిర్ణయించారు. నెల్లూరురూరల్‌ మండలం కొత్తూరు, నెల్లూరు బిట్‌ 1 వద్ద 4 ఎకరాల్లో హెల్త్‌ హబ్‌ నిర్మించి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏపీఐఐసీ ముమ్మరంగా కృషి చేస్తోంది. నెల్లూరు జిల్లా కేంద్రంలో 4 చోట్ల, వెంకటాచలం, కావలి, అనంతవరం, కొత్తపల్లి కౌరుగుంట, బొడ్డువారిపాళెం, ఆమంచర్ల, చెన్నాయపాళెం, ఏపూరు, గుడిపల్లిపాడు, పంటపాళెం, పైనాపురం, రామదాసుకండ్రిక, సర్వేపల్లి, తదితర ప్రాంతాల్లో 3,756.62 ఎకరాల భూమిలో పరిశ్రమల ఏర్పాటు కోసం 2 వేల ప్లాట్లు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం 738 ప్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నట్లు ఏపీఐఐసీ గణాంకాలు తెలియజేస్తున్నాయి.   

పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం 
ఏపీఐఐసీ ద్వారా సకల సదుపాయాలతో తీర్చిదిద్దిన పారిశ్రామికవాడల్లో పరిశ్రమలు స్థాపించాలనుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలుకుతున్నాం. జిల్లాలోని కొత్తపల్లికౌరుగుంట, నారంపేట, బొడ్డువారిపాళెం, అనంతవరం పారిశ్రామికవాడల్లో ఏర్పాటు చేసిన యూనిట్‌లను ఎస్సీ, ఎస్టీల వారికి 50 శాతం సబ్సిడీపై కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించే డీఐఈపీసీ సమావేశంలో కేటాయింపులు జరుగుతాయి. ఎస్సీ, ఎస్టీ కులాల వారికి 21 శాతం ప్లాట్లు రిజర్వు చేయబడతాయి. ఏపీఐఐసీ వెబ్‌సైట్‌లో పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు ఆధ్వర్యంలోని కమిటీ పరిశీలించి తుది నిర్ణయం చేస్తారు.  
– జే.చంద్రశేఖర్, జోనల్‌ మేనేజర్, ఏపీఐఐసీ నెల్లూరు 

మరిన్ని వార్తలు