బ్రహ్మదియా బొగ్గును తెచ్చేద్దాం

25 Apr, 2022 03:15 IST|Sakshi

జార్ఖండ్‌లోని బొగ్గు గనిపై ఏపీఎండీసీ దృష్టి

గతేడాది బిడ్డింగ్‌లో బ్రహ్మదియాను దక్కించుకున్న రాష్ట్ర ప్రభుత్వం

ఈ గనిలో అత్యంత నాణ్యమైన కోకింగ్‌ కోల్‌

నాలుగైదు నెలల్లో తవ్వకాలు మొదలుపెట్టేందుకు ఏపీఎండీసీ చర్యలు

తక్కువ సమయంలోనే ఎక్కువ ఉత్పత్తి చేసేలా కసరత్తు

ఇప్పటికే మధ్యప్రదేశ్‌లోని సుల్యారీలో తవ్వకాలు ప్రారంభం  

సాక్షి, అమరావతి: మధ్యప్రదేశ్‌లోని సుల్యారీలో విజయవంతంగా బొగ్గు ఉత్పత్తి మొదలుపెట్టిన ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ).. ఇప్పుడు జార్ఖండ్‌లోని బ్రహ్మదియా బొగ్గు గనిపై దృష్టి సారించింది. ఈ గనిలోనూ సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తి ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కేంద్రం 2021లో నిర్వహించిన బిడ్డింగ్‌లో పలు ప్రైవేటు సంస్థలతో పోటీ పడి మరీ రాష్ట్ర ప్రభుత్వం ఈ బొగ్గు బ్లాక్‌ను దక్కించుకుంది. ఇందులో ఉన్న అత్యంత నాణ్యమైన కోకింగ్‌ కోల్‌ను ఉక్కు కర్మాగారాల్లో వినియోగిస్తారు. దీన్ని ఉత్పత్తి చేస్తే.. బయటి నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ నేపథ్యంలో బ్రహ్మదియాలో వీలైనంత త్వరగా బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఏపీఎండీసీ చర్యలు చేపట్టింది. 

అనుమతుల కోసం ప్రయత్నాలు..
బ్రహ్మదియాలో తవ్వకాలు జరిపేందుకు అవసరమైన పర్యావరణ అనుమతుల కోసం ఇప్పటికే ఏపీఎండీసీ దరఖాస్తు చేసింది. దీనిపై జార్ఖండ్‌ పర్యావరణ అథారిటీ స్పందించాల్సి ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఏపీఎండీసీ అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. నాలుగైదు నెలల్లో అనుమతి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈలోపు మైనింగ్‌ లీజు, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు సాధించేందుకు చర్యలు చేపట్టారు. త్వరలో అవి కూడా వస్తాయని ఏపీఎండీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈలోగా అవసరమైన భూ సేకరణపై దృష్టి కేంద్రీకరించారు.  
ఏడాదికి 5 లక్షల టన్నులు తవ్వేలా.. 
బ్రహ్మదియా గని నుంచి ఏడాదికి లక్షన్నర టన్నుల బొగ్గును 14 సంవత్సరాలపాటు ఉత్పత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం లైసెన్సు ఇచ్చింది. కానీ స్థానికంగా అక్రమ బొగ్గు తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో బ్రహ్మదియాలోని బొగ్గు నిల్వలను తక్కువ సమయంలోనే మైనింగ్‌ చేయాలని ఏపీఎండీసీ భావిస్తోంది. ఏడాదికి లక్షన్నర టన్నులకు బదులు ఐదు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరింది. కేంద్రం సానుకూలంగా స్పందిస్తే నాలుగైదేళ్లలోనే ఈ గనిలో బొగ్గు తవ్వకాలు పూర్తి చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

త్వరలో మైనింగ్‌ ప్రారంభిస్తాం.. 
సుల్యారీలో బొగ్గు ఉత్పత్తి మొదలుపెట్టి జాతీయ స్థాయిలో సింగరేణి, కోల్‌ ఇండియా సరసన నిలిచాం. పర్యావరణ అనుమతులు సాధించి త్వరలో బ్రహ్మదియాలోనూ ఉత్పత్తి ప్రారంభిస్తాం. దీని వల్ల మన రాష్ట్ర అవసరాల కోసం ఇతర ప్రాంతాల నుంచి బొగ్గును కొనుగోలు చేయాల్సిన అవసరముండదు. 
    – వీజీ వెంకటరెడ్డి, గనుల శాఖ డైరెక్టర్‌ 

మరిన్ని వార్తలు