నా మాటలను వక్రీకరించారు

7 Dec, 2021 04:21 IST|Sakshi

రాజకీయ స్వలాభం కోసం కొన్ని మీడియా సంస్థలు ఇలా చేశాయి

ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు

శ్రీకాకుళం అర్బన్‌: రాజకీయ స్వలాభం కోసం తన మాటలను కొన్ని పత్రికలు, మీడియా వక్రీకరించి కథనాలు ఇచ్చాయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చెప్పారు. సోమవారం శ్రీకాకుళంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సంబంధించిన 71 సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.

ఉద్యోగ సంఘాల ఉద్యమాన్ని రాజకీయ కోణంలో చూడొద్దని అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య సఖ్యత చెడగొట్టేందుకే కొన్ని మీడియా సంస్థలు తన మాటలను వక్రీకరించాయని చెప్పారు. ఉద్యోగ సంఘాలు ఏ పార్టీకీ తొత్తులు కాదని, ఉద్యోగుల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగులకు కష్టమొస్తే ప్రభుత్వంపైనే అలుగుతామని, సమస్యలు పరిష్కరిస్తే అదే ప్రభుత్వానికి, సీఎంకు పాలాభిషేకం చేస్తామని పేర్కొన్నారు.

పీఆర్సీ నిరసనల్లో పాల్గొనం
ఏపీ ట్రెజరీ సర్వీసెస్‌ అసోసియేషన్, గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ ఫోరం
సాక్షి, అమరావతి: పీఆర్సీ ప్రకటించాలంటూ ఉద్యోగ సంఘాల జేఏసీలు మంగళవారం నుంచి తలపెట్టిన నిరసన కార్యక్రమాల్లో తాము పాల్గొనడం లేదని ఏపీ ట్రెజరీ సర్వీసెస్‌ అసోసియేషన్, ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ ఫోరమ్‌ తెలిపింది. ఈ మేరకు ట్రెజరీ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.రవికుమార్, ప్రధాన కార్యదర్శి డి.రమణారెడ్డి, గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ ఫోరమ్‌ అధ్యక్షుడు ఏవీ పటేల్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పీఆర్సీని పది రోజుల్లో ప్రకటిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలియజేసినందున.. మంగళవారం నుంచి జేఏసీలు చేపట్టే నిరసన కార్యక్రమాల్లో తాము పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల, అధికారుల సంక్షేమం విషయంలో సీఎం జగన్‌పై తమకు విశ్వాసం ఉందన్నారు.   

మరిన్ని వార్తలు