కువైట్‌లో చిక్కుకున్న మహిళకు ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ చేయూత 

30 Mar, 2022 04:11 IST|Sakshi
వి.ప్రశాంతితో ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ ఎన్‌.మహేశ్వర్‌రెడ్డి

కడప కార్పొరేషన్‌: తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు జల్లగుంట గ్రామానికి చెందిన మహిళకు ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ చేయూతనందించింది. వివరాలిలా ఉన్నాయి.. వెంపటపు ప్రశాంతి అనే మహిళ జీవనోపాధి కోసం 2020లో కువైట్‌కు వెళ్లింది. వెళ్లినప్పటి నుంచి ప్రతినెలా జీతం పంపుతూ, కుటుంబ సభ్యులతో తరచూ ఫోన్‌లో మాట్లాడేది. ఇటీవల తన వీసా గడువు ముగిసినా ఇండియాకు పంపకపోవడంతో ఆమె ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ హెల్ప్‌లైన్‌ను సంప్రదించి సాయం చేయమని అభ్యర్థించింది.

స్పందించిన ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ మహేశ్వర్‌రెడ్డి కువైట్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులను సంప్రదించి, ఆమెకు 10 రోజుల పాటు ఉచితంగా వసతి కల్పించటంతోపాటు తిరిగి ఇండియాకు తీసుకురావటానికి అవసరమైన పేపర్‌ వర్క్‌ అంతా పూర్తి చేయించారు. దీంతో ఆమె సోమవారం క్షేమంగా ఇండియాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ.. తాను ఇండియాకు తిరిగి రావటానికి సాయపడిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ చైర్మన్‌ మేడపాటి వెంకట్, సీఈవో దినేష్‌కుమార్, డైరెక్టర్‌ బీహెచ్‌ ఇలియాస్, వైఎస్సార్‌సీపీ కువైట్‌ కన్వీనర్‌ ఎం.బాలిరెడ్డి, ఎన్‌.మహేశ్వర్‌రెడ్డి, భారత రాయబార కార్యాలయ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  

మరిన్ని వార్తలు