నీలం సాహ్ని నియామకం సరైందే

8 Oct, 2021 04:00 IST|Sakshi

హైకోర్టు తీర్పు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని నియామకం సరైందేనని హైకోర్టు తేల్చిచెప్పింది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని.. రాజ్యాంగానికే లోబడే గవర్నర్‌ ఆమెను నియమించారని పేర్కొంది. గవర్నర్‌ నిర్ణయాన్ని ఏ రకంగానూ తప్పుపట్టలేమని పేర్కొంది. నీలం సాహ్ని నియామకాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన కోవారెంటో పిటిషన్‌ను కొట్టేసింది. ప్రస్తుత ప్రభుత్వంలో నీలం సాహ్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన సలహాదారుగా పనిచేశారని, అందువల్ల ఎన్నికల కమిషనర్‌గా ఆమె స్వతంత్రంగా విధులు నిర్వర్తించలేరన్నది పిటిషనర్‌ ఆరోపణ మాత్రమేనని స్పష్టం చేసింది. నీలం సాహ్ని స్వతంత్రంగా వ్యవహరించలేరనేందుకు పిటిషనర్‌ ఎలాంటి ఆధారాలను కోర్టు ముందుంచలేదని ఆక్షేపించింది.

ఆమె నియామకం విషయంలో ఏకపక్షత, దురుద్దేశాలు ఉన్నాయని నిరూపించడంలో పిటిషనర్‌ విఫలమయ్యారంది. ఎన్నికల కమిషనర్‌గా ఆమెను నియమించడం వల్ల పిటిషనర్‌ చట్టబద్ధ, రాజ్యాంగబద్ధ హక్కులకు ఎలాంటి విఘాతం కలగలేదని తెలిపింది. హక్కుల ఉల్లంఘన జరగనప్పుడు పిటిషనర్‌ ‘మాండమస్‌’ కోరలేరని న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం తీర్పునిచ్చారు. ఎన్నికల కమిషనర్‌గా ఏ అధికారంతో కొనసాగుతున్నారో నీలం సాహ్నిని వివరణ కోరడంతోపాటు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా జరిగిన ఆమె నియామకాన్ని రద్దు చేయాలని కోరుతూ విజయనగరం జిల్లాకు చెందిన న్యాయవాది మహేశ్వరరావు హైకోర్టులో  పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

ఆ నియామకం కూడా అలాగే జరిగింది..
‘‘మెమోరాండం ఆఫ్‌ ప్రొసీజర్‌’ ప్రకారం జడ్జిల నియామకాలు జరుగుతాయి. దీని ప్రకారం.. సీఎం ఓ న్యాయవాది పేరును    జడ్జి పోస్టుకు సిఫారసు చేయొచ్చు. అలా సిఫారసు చేసిన పేరును ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇలా జడ్జి అయిన న్యాయవాది.. న్యాయమూర్తిగా స్వతంత్రంగా వ్యవహరించలేరని ఎవరైనా చెప్పగలరా? ఇదే తీరులో ప్రస్తుత కేసులో కూడా గవర్నర్‌ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే నీలం సాహ్నిని ఎన్నికల కమిషనర్‌గా నియమించారు. ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యే నాటికి ఆమె ప్రధాన సలహాదారు పోస్టులో లేరు. కాబట్టి ఆమె రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్నారని చెప్పడానికి వీల్లేదు’ అని జస్టిస్‌ దేవానంద్‌ తన తీర్పులో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు