ప్రిలిమ్స్‌కు స్వస్తి: ఏపీపీఎస్సీ కీలక ప్రతిపాదన

18 Jun, 2021 03:23 IST|Sakshi

గ్రూప్‌ 2, 3 పరీక్షలపై ప్రతిపాదనలు

గ్రూప్‌ -1 మినహా మిగతా అన్నిటికీ ఒక్కటే పరీక్ష

సాక్షి, అమరావతి: గ్రూప్‌ -1 పోస్టుల్లో మినహా మిగతా క్యాడర్‌ పోస్టుల భర్తీ పరీక్షల విధానంలో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ భావిస్తోంది. ఇతర క్యాడర్‌ పోస్టులకు ప్రిలిమ్స్‌ పరీక్షల విధానాన్ని రద్దు చేయాలని యోచిస్తోంది. గ్రూప్‌ – 1 సహా అన్ని కేటగిరీల పోస్టుల భర్తీకి ప్రస్తుతం తొలుత ప్రిలిమ్స్‌/స్క్రీనింగ్‌ టెస్టు చేపట్టి అందులో అర్హత సాధించిన వారికి మెయిన్స్‌ పరీక్షను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇకపై గ్రూప్‌ – 2, గ్రూప్‌ – 3 సహా ఇతర క్యాడర్‌ పోస్టులకు ప్రిలిమ్స్‌ను రద్దు చేయాలని కమిషన్‌ తలపోస్తోంది. కేవలం ఒక పరీక్షనే నిర్వహించి మెరిట్‌ అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేయనున్నారు. ఇందుకు ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నట్లు కమిషన్‌ వర్గాలు వివరించాయి.

ఒత్తిడి నుంచి అభ్యర్థులకు ఊరట...
ప్రిలిమ్స్‌ నిర్వహణతో అభ్యర్థులు ఆర్థిక భారం, వ్యయప్రయాసలకు గురవుతుండగా కోచింగ్‌ పేరిట కొన్ని సంస్థలు భారీగా వసూలు చేస్తున్నాయి. గతంలో గ్రూప్‌–1  పోస్టులకే ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల విధానం ఉండేది. గ్రూప్‌–2, గ్రూప్‌–3 పోస్టులకు ఒక పరీక్ష ద్వారానే ఎంపికలు జరిగేవి. 2014లో టీడీపీ అధికారం చేపట్టాక తమ వారి కోచింగ్‌ సెంటర్లకు మేలు జరిగేలా పోస్టుల భర్తీ  విధానాన్ని మార్చింది. గ్రూప్‌ –1 సహా అన్ని పోస్టులకూ ప్రిలిమ్స్‌/స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించేలా ఉత్తర్వులిచ్చింది. దీనివల్ల అభ్యర్థులు పరీక్షల సన్నద్దత కోసం ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చేది. కోచింగ్‌ కేంద్రాల దోపిడీకి చెక్‌పెట్టేలా ఏపీపీఎస్సీ సమూల మార్పులపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రిలిమ్స్‌/ స్క్రీనింగ్‌ విధానాన్ని రద్దు చేయాలని భావిస్తోంది. తద్వారా అభ్యర్థులకు మేలు జరగడంతోపాటు కోచింగ్‌ సెంటర్ల దందాకు అడ్డుకట్ట పడుతుందని కమిషన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.   

మరిన్ని వార్తలు