సీఎం జగన్‌కు ఏపీపీటీడీ ఉద్యోగుల కృతజ్ఞతలు

28 Sep, 2022 04:14 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న ఏపీపీటీడీ ప్రతినిధులు.చిత్రంలో వెంకట్రామిరెడ్డి తదితరులు

మా సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజా రవాణా విభాగం (ఏపీపీటీడీ)కు చెందిన వైఎస్సార్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సీఎంను కలిశారు.

ప్రభుత్వ ఉద్యోగులకు కల్పిస్తున్న సదుపాయాలన్నీ పీటీడీ ఉద్యోగులకు కూడా కల్పిస్తున్నారని ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచినందుకు సంతోషం వ్యక్తం చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారం అక్టోబర్‌ ఒకటి నుంచి పెరిగిన జీతాలు తమకు ఇస్తుండటంపై కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసినవారిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, పీటీడీ వైఎస్సార్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డీఎస్‌పీ రావు, రాష్ట్ర నాయకులు ఎ.రాధాకృష్ణ, డి.ఏడుకొండలు తదితరులు ఉన్నారు. 

అక్టోబర్‌ 1 నుంచి పెరిగిన వేతనాలు..
అక్టోబర్‌ 1న ఆర్టీసీ ఉద్యోగులందరికీ పీఆర్సీ మేరకు పెరిగిన వేతనాలు అందుతాయని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన అనంతరం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు. అక్టోబర్‌ ఒకటిన పెంచిన వేతనాలివ్వాలని సీఎం అధికారులను ఆదేశించారన్నారు. ప్రభుత్వ అనుబంధ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని విన్నవించామని తెలిపారు.

అలాగే పలు కార్పొరేషన్లు, యూనివర్సిటీలు, గురుకులాలు, విద్యాసంస్థల్లో ఉద్యోగులకు కూడా పెంచాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. తమ విన్నపాలపై సీఎం జగన్‌ సానుకూలంగా స్పందించారన్నారు. పదవీ విరమణ వయసు పెంపుపై దస్త్రాన్ని సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారని తెలిపారు.  

మరిన్ని వార్తలు