తెలంగాణకు బస్సులపై నేడు మరోసారి భేటీ 

15 Sep, 2020 08:13 IST|Sakshi

హైదరాబాద్‌లో సమావేశం కానున్న ఇరు రాష్ట్రాల రవాణా శాఖ ముఖ్యకార్యదర్శులు

సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులను నడపటంపై నెలకొన్న చిక్కుముడి వీడటం లేదు. కిలోమీటర్లు ప్రాతిపదికన బస్సులు తిప్పే అంశంపై ఏపీఎస్‌ ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఏపీఎస్‌ఆర్టీసీ తమ భూ భాగంలో బస్సులను తిప్పే కిలోమీటర్లు తగ్గించాలని టీఎస్‌ఆర్టీసీ డిమాండ్‌ చేస్తోంది. ఏకంగా 1.10 లక్షల కి.మీ.మేర ఏపీఎస్‌ఆర్టీసీ తగ్గించుకోవాలని పట్టుబడుతోంది. తాము 50 వేల కిలోమీటర్లు తగ్గిస్తామని, టీఎస్‌ఆర్టీసీని 50 వేల కిలోమీటర్లు పెంచుకోవచ్చని సూచిస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు లేఖలు రాసినా స్పందించడంలేదు. 

ప్రైవేట్‌ దూకుడు.. 

  • అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరకపోవడంతో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ నిర్వాహకులు స్పీడ్‌ పెంచారు. ఏకంగా  750 ప్రైవేట్‌ బస్సులను ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు నడుపుతున్నారు. 
  • ప్రైవేట్‌ ట్రావెల్స్‌ గుత్తాధిపత్యం పెరుగుతుండటంతో ఏపీ ప్రభుత్వం మరోమారు తెలంగాణతో చర్చలు జరిపేందుకు సిద్ధమైంది. మంగళవారం హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల రవాణా శాఖ ముఖ్య కార్యదర్శులు భేటీ కానున్నారు. రెండు రాష్ట్రాల ఆర్టీసీలు ప్రాథమికంగా 72 వేల కి.మీ. తిప్పేలా చర్యలు తీసుకోవాలని ఏపీఎస్‌ఆర్టీసీ కోరనుంది. 

బస్సుల ప్రాతిపదికన మేలు.. 

  • రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందం కిలోమీటర్ల ప్రాతిపదికన కాకుండా బస్సుల ప్రాతిపదికన అయితే మేలని రవాణా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
  • కిలోమీటర్లు ప్రాతిపదికన అయితే ఏపీఎస్‌ఆర్టీసీకి నష్టం వస్తుంది. ఉదాహరణకు కర్నూలు నుంచి హైదరాబాద్‌ రూట్‌లో బస్సు తిప్పితే కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే ఏపీ భూ భాగంలో ప్రయాణం చేయాలి. మిగిలిన 200 కిలోమీటర్లు తెలంగాణ భూ భాగంలో ప్రయాణించాలి. అంటే రౌండ్‌ ట్రిప్‌లో 400 కి.మీ.ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు ప్రయాణిస్తే టీఎస్‌ఆర్టీసీ కేవలం 20 కి.మీ. మాత్రమే ఏపీ భూ భాగంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 
  • అంతర్రాష్ట్ర ఒప్పందం చట్టం ప్రకారం బస్సుల ప్రాతిపదికగా కూడా ఒప్పందం చేసుకోవచ్చు. 
  • ఏపీఎస్‌ఆర్టీసీ తమిళనాడు, పాండిచ్చేరిలతో బస్సుల ప్రాతిపదికగానే ఒప్పందాలున్నాయి. రెండు రాష్ట్రాల అధికారుల చర్చల తర్వాత మంత్రుల భేటీ ఉంటుంది. అంతర్రాష్ట్ర ఒప్పందం అంశంపై ఇందులో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  

 అంతర్రాష్ట్ర ఒప్పందం అంటే...? 

  • రెండు రాష్ట్రాల మధ్య రవాణా రంగంలో ఈ ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ చట్టం ప్రకారం ఎలాంటి పన్ను లేకుండా రాష్ట్రంలోకి వాహనాలు అనుమతించాలి. సాధారణంగా వాహనం రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు ట్యాక్స్‌ చెల్లించాలి. అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగితే 2 రాష్ట్రాల్లో సమానంగా ట్యాక్స్‌ లేకుండా వాహనాలను తిప్పుకోవచ్చు. 
మరిన్ని వార్తలు