తెలంగాణ సరిహద్దుల వరకు ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు

25 Oct, 2020 04:35 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ–తెలంగాణ సరిహద్దుల వద్ద ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంచామని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని లేక్‌ వ్యూ అతిధి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దసరాను పురస్కరించుకుని సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఆర్టీసీ సేవలందిస్తుందన్నారు. పంచలింగాల, గరికపాడు, వాడపల్లి, పైలాన్, జీలుగుమిల్లి, కల్లుగూడెం చెక్‌పోస్టుల వద్ద ఏపీ బస్సులు ఉంటాయన్నారు. 

► జూన్‌ 18 నుంచి టీఎస్‌ఆర్టీసీ అధికారులతో చర్చలు జరుపుతూనే ఉన్నాం. 1.61 లక్షల కిలోమీటర్లకే పరిమితం అవుతూ వారి డిమాండ్లకు అనుకూలంగానే ప్రతిపాదనలు పంపాం. రూట్ల వారీగా కూడా స్పష్టత ఇచ్చాం. ఏపీఎస్‌ఆర్టీసీ లాభనష్టాలు చూడడం లేదు. ప్రజలు ఇబ్బంది పడకూడదనేదే మా అభిమతం. 
► కేంద్రం గతేడాది మోటారు వాహన చట్టంలో 31 సెక్షన్లను సవరిస్తూ పార్లమెంట్‌లో తీర్మానం చేసింది. ఇందులో 20 సెక్షన్లను ఏ రాష్ట్రం కూడా మార్పు చేయలేని పరిస్థితి. అందువల్ల నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. దీన్ని వాహనదారులు సామాజిక బాధ్యతగా భావించాలి.
► దీనిపై ప్రతిపక్షాలు.. ప్రధానంగా టీడీపీ రాద్ధాంతం చేస్తోంది. ప్రభుత్వంపై సోషల్‌ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. 
► నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తించే వారికి, సరైన క్రమశిక్షణ నేర్పించే ఉద్దేశంతోనే జరిమానాలు పెంచాము. రాష్ట్రంలో రహదారుల మరమ్మతుకు సీఎం వైఎస్‌ జగన్‌ రూ.2,500 కోట్లు మంజూరు చేశారు. 

ఏపీ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఆర్టీసీ బస్సులు
సాక్షి, అమరావతి/ఆటోనగర్‌(విజయవాడ తూర్పు): ప్రయాణికులకు ఇబ్బందుల్లేకుండా ఏపీఎస్‌ ఆర్టీసీ తెలంగాణ సరిహద్దుల వరకు బస్సులు నడుపుతోంది. ఇందుకోసం 6 జిల్లాల రీజియన్లకు సంబంధించి సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద 38 బస్‌ సరీ్వసులను అందుబాటులో ఉంచింది. కర్నూలు, గుంటూరు, కృష్ణా, ఒంగోలు, తూర్పుగోదావరి, విశాఖ రీజియన్లకు సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ప్రత్యేకాధికారులను కూడా నియమించింది.  

మరిన్ని వార్తలు