ఆర్టీసీ కార్గో రికార్డు రాబడి

29 Dec, 2022 05:38 IST|Sakshi

2022–23లో ఇప్పటికే రూ.123 కోట్లు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) కార్గో రవాణా సేవలకు విశేష ఆదరణ లభిస్తోంది. సత్వరం డోర్‌ డెలివరీ సౌలభ్యంతో ప్రవేశపెట్టిన కార్గో రవాణా సేవల ద్వారా ఆర్టీసీ రికార్డుస్థాయిలో రాబడి సాధిస్తోంది. 2022లో ఏకంగా రూ.122.33 కోట్ల రాబడి సాధించి రికార్డు సృష్టించింది. 2021 కంటే ఇది 30 శాతం అధికం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆర్టీసీ 2021–22లో కార్గో రవాణా ద్వారా రూ.122.19 కోట్ల  రాబడి సాధించింది. 2022–23లో డిసెంబర్‌ 25 నాటికే రూ.122.33 కోట్ల రాబడి సాధించడం విశేషం.

ఆర్థిక సంవత్సరం ఇంకా మూడునెలలు ఉండటంతో ఈ రాబడి రూ.150 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. 2022లో కార్గో రవాణా రాబడిలో తిరుపతి కేంద్రంగా ఉన్న జోన్‌–4 అత్యధికంగా రూ.34.28 కోట్లు సాధించింది. రాష్ట్రంలో ఆర్టీసీ నిర్వహిస్తున్న 329 బస్‌స్టేషన్లలో.. 249 బస్‌స్టేషన్ల నుంచి కార్గో సేవలను అందిస్తోంది. బస్‌స్టేషన్ల వద్ద కాకుండా ఇతర ప్రదేశాల్లో ఆర్టీసీకి 525 మంది పార్సిల్‌ బుకింగ్‌ ఏజెంట్లను నియమించింది. మరోవైపు డోర్‌ డెలివరీ సౌలభ్యాన్ని కూడా అందిస్తోంది. దీంతో ఆర్టీసీ కార్గో రవాణా సేవలకు సానుకూల స్పందన లభిస్తోంది.  

మరిన్ని వార్తలు