ఏపీఎస్‌ఆర్టీసీ అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు పెంపు 

24 Aug, 2020 04:59 IST|Sakshi

ముందస్తు రిజర్వేషన్లను నెల రోజులకు పొడిగిస్తూ ఆర్టీసీ నిర్ణయం 

కోవిడ్‌–19 కారణంగా గతంలో వారం రోజులే గడువు 

తెలంగాణకు బస్‌ సర్వీసులు నడిపే అంశంపై నేడు చర్చలు

సాక్షి, అమరావతి: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు 30 రోజులు ముందుగానే సీట్లను రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం కల్పిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి రోజు (శనివారం) నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులిచ్చింది. కోవిడ్‌–19 కారణంగా ఇంతకుముందు ఏడు రోజులు ముందుగా మాత్రమే రిజర్వేషన్‌ చేసుకునే అవకాశం ఉండేది. ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య ప్రయాణాలకు అనుమతించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో హైదరాబాద్‌కు బస్‌ సర్వీసులు తిప్పడంపై ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ అధికారులు హైదరాబాద్‌ బస్‌ భవన్‌లో సోమవారం భేటీ కానున్నారు.  

► ఇప్పటివరకు ఏపీఎస్‌ఆర్టీసీ కర్ణాటకకు మాత్రమే సర్వీసులు నడుపుతోంది. తమిళనాడు, తెలంగాణలకు సర్వీసులు లేవు. ఈ రాష్ట్రాలకు ప్రైవేటు బస్సులు కూడా తిరగడం లేదు.  
► కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేయాలని నిర్ణయించడంతో సెప్టెంబర్‌ 1 నుంచి ప్రైవేటు ఆపరేటర్లు తమ బస్సులను తిప్పనుండటంతో ఏపీఎస్‌ఆర్టీసీ ఎప్పటి నుంచి సర్వీసులు తిప్పాలనే అంశంపై సోమవారం నిర్ణయం వెలువడనుంది. 
► రెండు రాష్ట్రాల మధ్య సమానంగా అంతరాష్ట్ర బస్సులు నడపాలని ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీలు గతంలోనే అవగాహనకు వచ్చాయి. 

మరిన్ని వార్తలు