AP: ఆర్టీసీకి జై కొట్టిన ప్రయాణికులు.. రెగ్యులర్‌ చార్జీలతోనే రెట్టింపు ఆదాయం

7 Oct, 2022 11:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: దసరా సీజన్‌లో కూడా రెగ్యులర్‌ చార్జీలే అమలు చేసిన ఆర్టీసీకి ప్రయాణికులు జై కొట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 4,500 సర్వీసుల్లో ఏకంగా 1.84 లక్షల మంది ప్రయాణాలు సాగించారు. 80 శాతం ఆక్యుపెన్సీ రేటుతో రూ.4.42 కోట్ల ఆదాయం సమకూర్చారు. కొత్త రికార్డు సృష్టించారు. వివరాల్లోకి వెళితే... దశాబ్దకాలంగా ఆర్టీసీ దసరా సీజన్‌లో అధిక చార్జీలు వసూలు చేస్తూ వచ్చింది. రెగ్యులర్‌ టికెట్ల కంటే 50శాతం పెంచడం పరిపాటిగా మారింది.
చదవండి: జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి

నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇది దోహద పడుతుందని భావించేవారు. అయితే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఉద్యోగుల జీతాల వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో సర్వీసులే తక్కువుగా నడిపారు. తొలిసారిగా ఈ ఏడాది దసరా సీజన్‌లో అధిక చార్జీలు వసూలు చేయకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది.

సెప్టెంబర్‌ 25 నుంచి దసరా వరకు 2,206 ప్రత్యేక సర్వీసులు నడిపింది. రెగ్యులర్‌ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడపడంతో ప్రయాణికుల నుంచి మంచి  స్పందన లభించింది. ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికే ప్రాధాన్యమిచ్చారు. గతేడాది 150 శాతం చార్జీలు వసూలు చేసినా సరే రూ.2.10కోట్ల రాబడే వచ్చింది. ఆర్టీసీపై ప్రయాణికుల్లో పెరుగుతున్న ఆదరణకు ఈ దసరా సీజన్‌ ప్రతీకగా నిలిచింది. ఇదే స్ఫూర్తితో 10వ తేదీ వరకు 2,400 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. 

మరిన్ని వార్తలు