ఆర్టీసీ ఉద్యోగులకు 11వ పీఆర్సీ అమలుపై హర్షం 

2 Oct, 2022 04:47 IST|Sakshi

మాట నిలబెట్టుకున్న సీఎం జగన్‌  

థాంక్యూ సీఎం సార్‌ అంటూ.. జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకాలు   

సాక్షి, అమరావతి: పీటీడీ(ఆర్టీసీ) ఉద్యోగులకు 11వ పీఆర్సీ అమలుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలివ్వడంపై పలు ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. మాట నిలబెట్టుకున్న సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ పీటీడీ వైఎస్సార్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం థాంక్యూ సీఎం సార్‌.. అంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు.

విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు డీఎస్పీ రావు, ముఖ్య ఉపాధ్యక్షుడు నాయుడు, ప్రధాన కార్యదర్శి అబ్రహాంలు ప్రసంగించారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం జగన్‌.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారని గుర్తు చేశారు. 52,000 మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తూ 2020 జనవరి 1న నూతన సంవత్సర కానుక ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

అలాగే ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల నెరవేర్చి పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచారని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతన స్కేల్స్‌ ద్వారా పీఆర్సీని అమలు చేస్తూ ఆర్టీసీ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం జగన్‌కు ఆర్టీసీ ఉద్యోగులంతా రుణపడి ఉంటారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనిట్లలోనూ ‘థాంక్యూ సీఎం సార్‌’ అంటూ కృతజ్ఞత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకాలు నిర్వహించారు.  

ఏపీ పీటీడీ ఈయూ హర్షం 
ఆర్టీసీ ఉద్యోగులకు 11వ పీఆర్సీ అమలుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలివ్వడంపై ఏపీ పీటీడీ(ఆర్టీసీ) ఎంప్లాయిస్‌ యూనియన్‌(ఈయూ) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు వైవీరావు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు, చీఫ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ సుబ్రమణ్యంరాజు, ఉప ప్రధాన కార్యదర్శులు జీవీ నరసయ్య, ఆవుల ప్రభాకర్‌లు శనివారం ప్రకటనలు విడుదల చేశారు. సీఎం జగన్‌ ఆదేశాలతో దసరా పండగకు ముందే ఆర్టీసీ ఉద్యోగులకు పండుగొచ్చిందంటూ హర్షం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు