ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కల సాకారం!

21 Sep, 2022 10:50 IST|Sakshi

ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నాళ్లో వేచిన ఉదయం మరో పది రోజుల్లో రానుంది. ఉద్యోగుల దశాబ్దాల కలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేశారు. ఇన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులుగానే కొనసాగారు. సీఎం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగుల హోదాతో పాటు పీఆర్‌సీ వేతనాలను అందుకోబోతున్నారు. పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని అమల్లోకి తీసుకువస్తుండడంతో ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబాల్లో సంతోషం పరిఢవిల్లుతోంది.

నెల్లూరు (క్రైమ్‌):  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పని మడమ తిప్పని నేతగా, ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ ఏపీఎస్‌ఆరీ్టసీని ప్రత్యేక కార్పొరేషన్‌ సంస్థగా ఏర్పాటు చేశారు. ఇందుకు ప్రభుత్వ పరంగా నిధులు కల్పించి ఆ సంస్థను ప్రజలకు అందించారు. ఆర్టీసీ బస్సుతో ప్రతి పల్లె జనంతో విడదీయరాని బంధం ఏర్పడింది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తూ వారి మన్ననలను చూరగొంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆర్టీసీ బస్సులను తన ప్రచార సభలకు వాడుకుని ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టాలకు కారకులయ్యారు. ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతున్న ఆర్టీసీకి నిధులిచ్చి ఆదుకోవాల్సిన అప్పటి చంద్రబాబు సర్కార్‌ అందుకు భిన్నంగా వ్యవహరించింది.

నష్టాల పేరుతో ప్రైవేట్‌ పరం చేసేందుకు ఎన్నోసార్లు కుయుక్తులు పన్నారు. అయితే ఉద్యోగులు,కార్మికులు ఈ చర్యలను అడ్డుకుని సంస్థను కాపాడుకునేందుకున్నారు. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి సంస్థను ఆర్టీసీ నిధులు అందించి లాభాలు ఆర్జీంచేందుకు చర్యలు తీసుకున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించారు. అయితే ఆ తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన ప్రభుత్వాలు తమ ఏకపక్ష నిర్ణయాలు, నిరంకుశ విధానాలతో సంస్థ నష్టాల ఊబిలో కూరుకుపోయింది.

కార్మికుల కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. ఈ క్రమంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆర్టీసీ కార్మికుల కలిసి పరిస్థితి వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించారు. ఇచ్చిన హామీకి కట్టుబడి ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఏపీపీటీడీగా మార్చారు. ఇప్పటి వరకు కార్మికులుగానే ఉన్న వీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపులోకి వచ్చారు. అక్టోబర్‌ ఒకటి నుంచి నూతన పీఆర్సీని అమలు చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో ఉద్యోగుల్లో ఆనందం నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అక్టోబర్‌ ఒకటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులందరికి పీఆర్సీ అమలు చేస్తామని ప్రకటించారు. దీంతో ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సంస్థలో పని చేస్తున్న కార్మికులు గతంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.    

3,011 మందికి లబ్ధి
నెల్లూరు రీజియన్‌లో నెల్లూరు 1 ,2, రాపూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు డిపోల్లో 2,951 మంది  ఉద్యోగులున్నారు. వీరితో పాటు ఆర్‌ఎం కార్యాలయంలోని 60 మంది ఉద్యోగులు మొత్తంగా 3,011 మందికి నూతన పీఆర్సీ ప్రకారం అక్టోబర్‌ ఒకటి నుంచి  కొత్త జీతాలు అందనున్నాయి. ఉద్యోగుల స్థాయిని బట్టి రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు అదనంగా జీతాలు పెరగనున్నాయి. వీటితో పాటు టీఏ, డీఏలు, ఇతర అలవెన్స్‌లు అందనున్నాయి.  

పీఆర్సీని స్వాగతిస్తున్నాం
ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత తొలిసారి అమలు చేస్తున్న పీఆర్సీని స్వాగతిస్తున్నాం. పీఆర్సీ అమలుతో జీతాలు పెరగనుండటం మా జీవితాలు కూడా మారుతాయి. చాలా ఆనందంగా ఉంది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ఆర్టీసీ ఉద్యోగులు జన్మజన్మలకు రుణపడి ఉంటాం. 
– మురళీ, ఎన్‌ఎంయూ నాయకుడు 

ఇచ్చిన మాటకు కట్టుబడి
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మేము ప్రభుత్వ ఉద్యోగులమని గర్వంగా చెప్పుకుంటున్నాం. మాకు సమాజంలో గౌరవం పెరిగింది. పీఆర్సీ అమలుతో కొత్త జీతాలు రానుండడం సంతోషంగా ఉంది. 
– మేకపాటి చిన్నారెడ్డి, ఎన్‌ఎంయూ అధ్యక్షుడు ఆత్మకూరు డిపో 

ఆనందంగా ఉంది
ఎన్నో అవరోధాలను అధిగమించి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఇప్పటి వరకు చిన్నపాటి జీతాలు తీసుకుంటున్నాం. పీఆర్సీ ద్వారా జీతాలు పెరగనున్నాయి. పాతబకాయిలు సైతం విజయదశమి నాటికి అందజేస్తుండడంతో ఉద్యోగులకు మరింత ఊరట కలుగుతుంది.        
 – షేక్‌ మహమ్మద్‌ అలీ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ప్రచారకార్యదర్శి, ఆత్మకూరు డిపో   

సీఎం జగన్‌కు రుణపడి ఉన్నాం
ఆర్టీసీ కార్మికులందరూప్రభుత్వ ఉద్యోగులుగా మారడం సంతోషంగా ఉంది. సమాజంలో గౌరవం పెరిగింది.  ప్రస్తుతం అన్నీ రాయితీలు మాకు అందుతున్నాయి. పీఆర్సీతో జీతాలు పెరగనున్నాయి. మా దశబ్దాల కల నెరవేరింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉన్నాం.
– వి. వెంకటాద్రి, వైఎస్సార్‌ మజ్దూర్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రచార కార్యదర్శి  
 

మరిన్ని వార్తలు