AP: సీఎం జగన్‌ను కలిసిన ఆర్టీసీ ఉద్యోగులు

27 Sep, 2022 14:57 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆర్టీసీ ఉద్యోగులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మంగళవారం  కలిశారు. తమకు పీఆర్సీ అమలు చేయడంపై ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్నారని ప్రస్తావించారు.

కరోనా సమయంలోనూ ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇబ్బంది లేకుండా చేశారని గుర్తు చేశారు. తాజాగా అక్టోబర్ 1 నుంచి వారికి పీఆర్సీ అమలు చేయబోతున్నట్లు తెలిపారు. గురుకుల, ఎయిడెడ్, యూనివర్సిటీ ఉద్యోగుల వయోపరిమితి పెంచే విషయంపై సీఎం సానుకూలంగా స్పందించారని వెంకట్రామిరెడ్డి తెలిపారు.

52 వేల మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం వైఎస్ జగన్‌ది అని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ (ఏపీపీటీడీ) వైఎస్సార్‌ ఎంప్లాయ్‌ అసోసియేషన్‌ నేత చల్లా చంద్రయ్య కొనియాడారు. తమకు 10 వేల కోట్ల జీతాలు చెల్లించి ఆర్టీసీ భవిష్యత్తును కాపాడినట్లు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి కొత్త పే స్కేల్ అమలు చేయబోతున్న క్రమంలో సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు ముఖ్యమంత్రికి రుణపడాల్సి ఉందన్నారు. పెన్షన్ విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లామని, దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. పదోన్నతుల ఫైల్ కూడా ప్రభుత్వానికి పంపినట్లు, ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. 
చదవండి: ఆర్గానిక్‌ పాల ఉత్పత్తిపై దృష్టి సారించాలి: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు