‘ఆర్టీసీ’లో ఎన్నికల హారన్‌ 

11 Nov, 2021 03:37 IST|Sakshi

ఉద్యోగుల సొసైటీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల 

ఈ నెల 15న నోటిఫికేషన్‌ 

అప్పటి వరకూ ఓటర్ల నమోదుకు అవకాశం  

డిసెంబర్‌ 14న ప్రతినిధుల ఎన్నికల పోలింగ్‌ 

డిసెంబర్‌ 29న పాలక మండలి సభ్యుల ఎన్నిక

సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు–పరపతి సహకార సొసైటీ ఎన్నికల నగారా మోగింది. రెండేళ్ల కాల పరిమితితో 210 మంది ప్రతినిధులను ఎన్నుకునేందుకు డిసెంబర్‌ 14న ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం ఎన్నికైన సొసైటీ ప్రతినిధులు 9 మంది పాలక మండలి సభ్యులను డిసెంబర్‌ 29న ఎన్నుకుంటారు. ఈ మేరకు సొసైటీ ఎన్నికల షెడ్యూల్‌ బుధవారం వెలువడింది. దాని ప్రకారం.. సొసైటీ నూతన పాలకమండలి ఎన్నికలకు నోటిఫికేషన్‌ను 15న విడుదల చేస్తారు. నోటిఫికేషన్‌ విడుదలయ్యే నాటికి సొసైటీలో సభ్యులుగా నమోదైన వారు ఓటర్లుగా ఉంటారు. కనీసం ఏడాది సర్వీస్‌ను పూర్తి చేసుకుని, సీసీఎస్‌ ఫామ్‌ సమర్పించడంతో పాటు రూ.300 షేర్‌ క్యాపిటల్‌ చెల్లించిన ఆర్టీసీ ఉద్యోగులు ఓటర్లుగా నమోదయ్యేందుకు అర్హులు.

నూతన ఓటర్ల నమోదు ఈ నెల 15 వరకూ కొనసాగుతుంది. ప్రస్తుతం సొసైటీలో 50,300 మంది ఓటర్లున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌పై అభ్యంతరాలను ఈ నెల 22 వరకూ స్వీకరిస్తారు. ఈ నెల 29 నుంచి డిసెంబర్‌ 12 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు డిసెంబర్‌ 10 వరకూ అవకాశం కల్పిస్తారు. పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను డిసెంబర్‌ 10న ప్రకటిస్తారు. పోలింగ్‌ను డిసెంబర్‌ 14న నిర్వహించి.. అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. ఎన్నికైన ప్రతినిధులు 9 మంది పాలక మండలి సభ్యులను ఎన్నుకుంటారు. ఆర్టీసీ నాలుగు జోన్ల నుంచి ఇద్దరు చొప్పున సభ్యులు, హెడ్‌ ఆఫీస్‌ నుంచి ఒక సభ్యుడు.. మొత్తం మీద 9 మంది పాలక మండలి సభ్యులను ఎన్నుకుంటారు. ఆర్టీసీ ఎండీ చైర్మన్‌గా వ్యవహరించే ఈ సొసైటీకి వైస్‌ చైర్మన్‌గా ఆర్టీసీ ఈడీతో పాటు, మరో ముగ్గురు అధికారులు సభ్యులుగా ఉంటారు. ఇదిలా ఉండగా ఆర్టీసీలో సొసైటీ ఎన్నికల హడావుడి ఇప్పటికే మొదలైంది.  

హామీలు నెరవేర్చాం.. మరోసారి అవకాశం ఇవ్వండి 
ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ తమ సభ్యులతో విజయవాడలో బుధవారం సమావేశం నిర్వహించింది. ఈయూ నేతృత్వంలోని పాలక మండలి.. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి విశేషంగా కృషి చేసిందని ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైవీ రావు, దామోదరరావు చెప్పారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామన్నారు. సొసైటీకి రావాల్సిన బకాయిలను చెల్లించేందుకు ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు బుధవారం హామీ ఇవ్వడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు మరిన్ని సేవలందించేందుకు ఈయూ అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు.  

ఎన్‌ఎంయూ అభ్యర్థులను గెలిపించండి 
సొసైటీ ఎన్నికల్లో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ (ఎన్‌ఎంయూ) అభ్యర్థులను గెలిపించాలని ఆ సంఘం అధ్యక్షుడు రమణారెడ్డి కోరారు. విజయవాడలో ఎన్‌ఎంయూ బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకవర్గం వైఫల్యంతో కుటుంబ నేస్తం, జనతా వ్యక్తిగత బీమా పథకాలు రద్దయ్యాయని విమర్శించారు. సొసైటీకి సంస్థ నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టలేకపోయారని విమర్శించారు.    

మరిన్ని వార్తలు