ఆర్టీసీపై ‘పోలవరం’ భారం

9 Nov, 2020 20:44 IST|Sakshi

పోలవరం చూసేందుకు పెట్టిన బస్సులకు బిల్లులు చెల్లించని చంద్రబాబు ప్రభుత్వం

ఒంగోలు డిపోలోనే పేరుకుపోయిన దాదాపు రూ.4 కోట్ల బకాయిలు

చంద్రబాబు నిర్వాకంతో అప్పుల ఊబిలోకి ఆర్టీసీ

వైఎస్‌ జగన్‌ చలువ వల్లే్ ఒడ్డున పడ్డామంటున్న ఆర్టీసీ కార్మికులు

ఒంగోలు : వాస్తవం కన్నా కల్పననే తెలుగు తమ్ముళ్లు ఎక్కువగా కోరుకుంటారు. అందుకేనేమో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం మొత్తం పూర్తిచేసినట్లు ఆ అద్భుత దృశ్యాన్ని కళ్లారా చూద్దురు రండి అంటూ ప్రజానీకాన్ని బస్సులు పెట్టి మరీ తరలించారు. తెలుగు తమ్ముళ్లు అడిగిందే తడవుగా పోలవరానికి ఆర్టీసీ బస్సులు బయల్దేరాయి. బస్సు బయల్దేరాలంటే ముందుగా డిపాజిట్‌ చెల్లించాలి...ఆ తరువాత తక్కువ దూరం అయితే రోజుకు అద్దె, ఎక్కువ దూరం అయితే గంటల చొప్పున చార్జీ చెల్లించాలి. కానీ ఈ నిబంధనలన్నీ సామాన్యులకు మాత్రమే. జిల్లా నుంచి జనాల్ని పోలవరానికి తరలించేందుకు పెట్టిన ఆర్టీసీ బస్సులకు రూ.3.83 కోట్లు ఖర్చయితే రూ.18 లక్షలు మాత్రమే ప్రభుత్వం నుంచి చెల్లించారు. 

ఒక్క ఒంగోలు డిపోలోనే రూ.3 కోట్లుపైగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రూ.500 కోట్ల వరకు బకాయిలు ఉండి ఉండవచ్చని అంచనా. ఒంగోలు జయప్రకాష్‌ కాలనీకి చెందిన పోతు ఆంజనేయులు అనే వ్యక్తి తాజాగా సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రజాధనాన్ని తమ నేతలను తృప్తిపరిచేందుకు, ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు పోలవరం యాత్ర పేరుతో ఖర్చుచేశారు తప్ప ఏనాడు అప్పుల్లో ఉన్న ఆర్టీసీని సంక్షోభం నుంచి గట్టెక్కించాలని చంద్రబాబు భావించలేదు.

జరిగింది ఇదీ:
గత ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వంపై జనంలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. మరో వైపు ప్రజా సంకల్పయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జనం జేజేలు పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో తమ పార్టీ నేతల ద్వారా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పరుగులు పెడుతుందంటూ చెప్పాలనుకున్నారు. ఇందుకుగాను ‘పోలవరం చూసొద్దాం రండి’ అంటూ ఉచితంగా బస్సుల ఏర్పాటుతోపాటు భోజన ఏర్పాట్లు కూడా చేశారు. ప్రభుత్వ ఖర్చుతో పార్టీకి లబ్ధి చేకూర్చడం అసలు ఉద్దేశం. ఒంగోలు డిపో నుంచి ఆల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌లగ్జరీ సర్వీసులను పోలవరానికి కేటాయించారు. ఒంగోలు డిపో నుంచి 2018 ఏప్రిల్‌ 23న పోలవరానికి వెళ్లిన బస్సు 21 గంటల్లో తిరిగి వచ్చింది. కానీ 25వ తేదీన వెళ్లిన బస్సు మాత్రం 36 గంటల సమయం తీసుకుంది. దాదాపు 15 గంటల అదనపు సమయం అంటే ఈ సమయంలో పోలవరంతోపాటు మార్గం మధ్యలో ఇతర పుణ్య క్షేత్రాలను చూపించి తీసుకొచ్చారా అన్న సంశయం కలుగుతోంది. 

2018 ఏప్రిల్‌ 23వ తేదీ మొదలు 2019 ఫిబ్రవరి 23వ తేదీ వరకు అంటే 10 నెలలపాటు ఈ సందర్శన కార్యక్రమాన్ని టీడీపీ నేతలు వినియోగించుకున్నారు. మొత్తం 18709 గంటల పాటు ఆర్టీసీ బస్సులను వినియోగించుకుని 3,81,314 కిలోమీటర్ల దూరం బస్సులను నడిపారు. ఇందుకుగాను అక్షరాల రూ.58,05,322లు, జీఎస్‌టీ బకాయిలు (18 శాతం) చెల్లించాల్సి ఉంది. జీఎస్‌టీతో కలిపితే ఆర్టీసీకి మొత్తం రూ.3,83,41,506లు బకాయి ఉండగా అందులో ఆర్టీసీకి జమైన మొత్తం రూ.18,01,731లు మాత్రమే. అంటే ఇంకా ఆర్టీసీకి రూ.3,65,39,775లు జమ కావాల్సి ఉంది. మరి..చంద్రబాబు ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయే.. ఆ బకాయి భారం నేడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై పడినట్లయింది. జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఏమాత్రం జాప్యం చేసి ఉన్నా ఒక వైపు అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీ కార్మికులకు జీతాలు చెల్లించడం సంగతి అటుంచి కరోనా కాలంలో ఆర్టీసీ ఉనికే ప్రశ్నార్థకంగా మారేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఆర్టీసీ అంటేనే బాబుకు వివక్ష:
రాజధాని నిర్మాణం అంటూ గ్రాఫిక్స్‌ చూపించి నమ్మించేందుకు యత్నించడంతోనే చంద్రబాబు పాలన కాస్త సరిపోయింది. డబ్బులు దండిగా ఉన్నట్లు పల్లెలకు బస్సులను సైతం ఆపేసి ప్రయాణికులను ఇబ్బందులు పాల్జేసి, తమ పార్టీ నేతలను సంతృప్తిపరిచేందుకు పోలవరానికి బస్సులు పంపేశారు. ఒక్క ఒంగోలు డిపో పరిధిలోనే పది నెలల కాలంలో రూ.3.65 కోట్ల బకాయిలు పెండింగ్‌ పెట్టారంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 డిపోలలో ఇంకెంత మొత్తం బకాయిలు ఉన్నాయో ఊహించడమే కష్టంగా ఉంది. బాబు గ్రాఫిక్స్‌ పాలనకు ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. - గడియం వెంకట్రామిరెడ్డి, ఏపీ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్‌ అభ్యుదయ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు

మరిన్ని వార్తలు