APSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు

23 Oct, 2021 08:51 IST|Sakshi

కొత్తగా ఎస్‌బీటీ ఫండ్‌ అమలు 

10 వేల మందికి పైగా ఉద్యోగులకు ప్రయోజనం

ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం   

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ ప్రజా రవాణా సంస్థ (ఆర్టీసీ)లో 55 ఏళ్ల వయసు దాటిన ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో మూసివేసిన ‘స్టాఫ్‌ బినవొలెంట్‌ త్రిఫ్ట్‌ (ఎస్‌బీటీ) ఫండ్‌’ను తిరిగి కొత్తగా ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దాదాపు 10వేల మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది. ఆర్టీసీలో ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌తో ఎస్‌బీటీ ఫండ్‌ను ఏళ్లపాటు నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులు చనిపోయినా/రిటైరైనా ఆ నిధి నుంచి రూ.1.50 లక్షల చొప్పున చెల్లించేవారు.

కాగా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ఎస్‌బీటీ స్థానంలో ‘ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌’ (ఏపీజీఎల్‌ఐ) అమల్లోకి వచ్చింది. కాగా, ఏపీజీఎల్‌ఐ 55 ఏళ్లలోపు ఉద్యోగులకే వర్తిస్తుంది. దాంతో ఆర్టీసీలో 55 ఏళ్లు దాటిన ఉద్యోగుల కోసం గతంలో ఉన్న అమలు చేసిన ఎస్‌బీటీ ఫండ్‌ను మళ్లీ ప్రవేశపెట్టాలని ఉద్యోగ సంఘాలు కోరాయి. దీంతో ఆర్టీసీ ఉన్నతాధికారులు చేసిన ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

ఆర్టీసీలో 55 ఏళ్లు దాటిన ఉద్యోగుల కోసం కొత్త ఎస్‌బీటీ ఫండ్‌ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ ఫండ్‌ 2021 డిసెంబర్‌ నాటికి 55 ఏళ్ల వయసు దాటిన వారందరికీ వర్తిస్తుంది. ఆ ఉద్యోగుల నుంచి నెలకు రూ.100 చొప్పున కంట్రిబ్యూషన్‌ వసూలు చేస్తారు. ఈ మేరకు రవాణా శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

చదవండి: TTD: నాలుగున్నర గంటల్లోనే 7.08 లక్షల టికెట్లు ఖాళీ

మరిన్ని వార్తలు