అద్దె బస్సులొస్తున్నాయ్‌!

25 Jul, 2022 09:54 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రయాణికుల అవసరాలు, అవస్థలు తీర్చడానికి అద్దె బస్సులొస్తున్నాయి. రద్దీకి అనుగుణంగా ఆయా ప్రాంతాలకు ఇవి నడవనున్నాయి. ఆర్టీసీ విశాఖపట్నం రీజియన్‌లో కొత్తగా 83 అద్దె బస్సులు నడపడానికి అనుమతులు లభించాయి. దీంతో ప్రయాణికుల తాకిడి అధికంగా ఉండి, బస్సు సరీ్వసులు తక్కువగా ఉన్న రూట్లను గుర్తించారు. విశాఖతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నంల నుంచి కూడా వివిధ ప్రాంతాలకు వీటిని నడపనున్నారు. అంతేకాదు చాన్నాళ్ల నుంచి విశాఖ నుంచి కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, ఇచ్ఛాపురం, పాలకొండ, సోంపేట, మందస వంటి దూర ప్రాంతాలకు బస్సుల డిమాండ్‌ ఉంది. బస్సుల కొరతతో సరిపడినన్ని సరీ్వసులను నడపలేక పోతున్నారు. ఇప్పుడు ఈ రూట్లలోనూ అద్దె బస్సులను నడిపి ప్రయాణికుల అవసరాలను తీర్చనున్నారు.  

మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు అధికం 
ఈ అద్దె బస్సుల్లో అత్యధికంగా మెట్రో ఎక్స్‌ప్రెస్‌లున్నాయి. మొత్తం 83 అద్దె బస్సులకు గాను 39 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు, 12 పల్లెవెలుగు,తొమ్మిది సిటీ ఆర్డినరీ, ఎనిమిది సూపర్‌ లగ్జరీ, ఎనిమిది ఎక్స్‌ప్రెస్, ఏడు అల్ట్రా డీలక్స్‌ సర్వీసులు. పల్లె వెలుగు సర్వీసులను
అనకాపల్లి– నర్సీపట్నం–అనకాపల్లి, అనకాపల్లి–విజయనగరం, నర్సీపట్నం–చోడవరంల మధ్య నడుపుతారు. మెట్రోలను విశాఖ నుంచి విజయనగరం, చోడవరం, కొత్తవలస, భీమిలి, యలమంచిలి, చోడవరం, అనకాపల్లి తదితర రూట్లకు, సూపర్‌ లగ్జరీలను విశాఖ నుంచి అమలాపురం, కాకినాడలకు, అల్ట్రా డీలక్స్‌లను రాజమండ్రి, ఇచ్ఛాపురం, పాలకొండలకు తిప్పుతారు. సిటీ ఆర్డినరీ సర్వీసులను ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి యలమంచిలి, దువ్వాడ రైల్వే స్టేషన్, సింథియా నుంచి సింహాచలంలకు కేటాయించారు.   

మూడు నెలల్లో రోడ్లపైకి.. 
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ అద్దె బస్సుల కోసం ఇటీవల టెండర్లు పిలిచారు. నెలాఖరుకల్లా వీటిని ఖరారు చేయనున్నారు. టెండర్లు ఖాయమయ్యాక అద్దె బస్సుల యజమానులకు మూడు నెలల గడువిస్తారు. ఆర్టీసీ యాజమాన్యం అధీకృత బాడీ బిల్డింగ్‌ యూనిట్లలో మాత్రమే ఈ బస్సులను తయారు చేయాల్సి ఉంటుంది. అద్దె బస్సులు అందుబాటులోకి వస్తే రద్దీ ఉన్న రూట్లలో బస్సుల కొరత తీరి ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుందని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణాధికారి ఎ.అప్పలరాజు ‘సాక్షి’కి చెప్పారు.  

మరిన్ని వార్తలు