ఆదాయం బాటలో ఏపీఎస్‌ ఆర్టీసీ

7 Mar, 2023 11:49 IST|Sakshi

నష్టాలను అధిగమించి లాభాల బాట

కార్గో సేవల ద్వారా విశేష ఆదాయార్జన

ప్రత్యేక సర్వీసులతో ప్యాకేజి టూరు

అదనపు ఆదాయ వనరులపై ఆర్టీసీ ఫోకస్‌

సాక్షి, కొవ్వూరు: నష్టాలను అధిగమించి అదనపు ఆదాయ ఆర్జనపై ఆర్టీసీ దృష్టి సారించింది. కార్గో సేవలను విస్తృతం చేయడం, ప్రయాణికులను ఆకర్షించేలా పర్యాటక ప్రాంతాలకు ప్యాకేజిలు ప్రవేశపెట్టడం, పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు నడపడం లాంటి చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆదాయం సమకూరే ఏమార్గాన్నీ వీడకుండా సంస్థ అధికారులు గట్టిగా కృషి చేస్తున్నారు. రెండేళ్లపాటు కరోనా విపత్తులో 50 నుంచి 60 శాతం మేర సంస్థ ఆదాయం కోల్పోయింది. కరోనా సద్దుమ­ణిగాక కొన్నాళ్లుగా పూర్వపు పరిస్థితిని సంతరించుకోగలిగింది. తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరంతో పాటు కొవ్వూరు, నిడదవోలు,గోకవరంలలో సంస్థకు డిపోలున్నాయి. వీటి పరిధిలో 56 రూట్లలో 301 బస్సులు నడుస్తున్నాయి.

కార్గో సేవలతో ఊపు
ఆర్టీసీకి కార్గో సేవలు బాగా కలిసొస్తున్నాయి. ఈ సేవల ద్వారా సంస్థకు విశేష ఆదాయం సమకూరుతోంది. గతేడాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్గో సేవల ఆదాయం విషయంలో రాష్ట్రంలోనే ప్రథమ స్ధానంలో నిలిచింది. ఈ ఏడాది కూడా ఆరంభం నుంచే జోరు కొనసాగిస్తోంది. ఈ ఆర్ధిక సంవత్సరంలో జనవరి నాటికి జిల్లా వ్యాప్తంగా రూ.8.90 కోట్ల మేరకు ఆదాయం ఆర్జించింది. ఈనెలాఖరుకు రూ.9.50 కోట్ల మేర సగటు ఆదాయం లభించనుందని అధికారులు లెక్కగట్టారు. 2016 జూన్‌ నుంచి కార్గో సేవలు ప్రారంభమమైనా ఆరంభంలో అంతగా ప్రభావం చూపించలేకపోయాయి. సరైన ప్రొత్సాహం..ప్రణాలిక లేకపోవడం ఇందుకు కారణం. టీడీపీ హయాంలో 2018–19లో కేవలం రూ.3.30 కోట్లు ఆదాయం మాత్రమే లభించింది. ఇప్పుడు దానికి రెండు రెట్లు మించి ఆదాయం పెరిగింది.

ప్రయాణికులను ఆకట్టుకునేలా సర్వీసులు
ప్రయాణీకులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ లక్కీ కూపన్ల విధానం ప్రవేశపెట్టింది. నెలనెలా డ్రా తీస్తోంది. విజేతలను ఎంపిక చేసి బహుమతులను అందజేస్తోంది. పంచభూత లింగదర్శిని పేరుతో కంచి, చిదంబరం, జంబుకేశ్వరం,అరుణాచలం, శ్రీకాళహస్తి ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. త్రివైకుంఠ దర్శిని పేరుతో భద్రాచలం, ద్వారకాతిరుమల, అన్న­వరం క్షేత్రాలకు ప్యాకేజి తరహాలో బస్సులు నడుపుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరిలో నవజనార్ధన పారిజాతాలుగా గుర్తింపు పొందిన తొమ్మిది క్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక యాత్ర బస్సు నడుతుతోంది. కార్తికమాసంలో పంచారామ క్షేత్రాలు, శబరిమలై, విజయ­వాడలకూ బస్సులు నడపుతూ ఆదాయం పెంచుకుంటోంది. సుమారు 50 మంది ముందుకు వస్తే ఎక్కడ నుంచి ఎక్కడికైనా బస్సు నడిపేందుకు తాము సిద్ధమని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. 2018–19లో ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా రూ.156.23 కోట్లు వస్తే ఈ ఏడాది రూ.197 కోట్ల వరకు ఆదాయం రానుందని అంచనా.

ఇతర ఆదాయ వనరుల ద్వారా..
అవకాశమున్న ఏ ఆదాయ వనరునూ ఆర్టీసీ విడిచి­పెట్టడం లేదు. డిపోల్లోని సైకిల్‌ స్టాండ్లు, దుకాణాల అద్ధెలతో పాటు ప్రత్యేక సర్వీసుల నిర్వహణ ద్వారా ఆదాయం పెంచుకుంటోంది. 2018–19లో నాలుగు డిపోలకు ఇతర మార్గాల ద్వారా రూ.34.90 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి రూ.38.83కోట్లు ఆదాయం సమకూరింది. ఫిబ్రవరి.. మార్చి నెలల ఆదాయం కూడా అంచనా వేసుకుంటే సుమారు రూ.42 కోట్ల మేర ఆదాయం వస్తుందని ఆర్టీసీ వర్గాలు భావిస్తున్నాయి. 2018–19లో నిడదవోలు డిపోకు ఇతర ఆదాయ వనరుల ద్వారా రూ.2.40 కోట్లు వస్తే ఇప్పుడు ఆ ఆదాయం రూ.3.51 కోట్లకు చేరుకుంది. అలాగే రాజమహేంద్రవరంలో రూ.20.22 కోట్ల నుంచి రూ.25.55 కోట్లకు, కొవ్వూరు డిపోలో రూ.3.86 కోట్ల నుంచి రూ.5.37కోట్లకు రాబడి సాధించింది.

మరిన్ని వార్తలు