ప్రభుత్వం ఎంతో చేసింది

2 Jan, 2022 05:32 IST|Sakshi

విశ్వసనీయతను చాటుదాం

ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు

సాక్షి, అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలై ఖచ్చితంగా రెండేళ్లు పూర్తయ్యిందని, 2020 జనవరి 1న ప్రభుత్వంలో సంస్థ విలీనమైందని ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు అన్నారు. ప్రభుత్వం మనకు ఎంతో చేసిందని, మన విశ్వసనీయతను చాటుకుందామని ఆయన ఆర్టీసీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ హౌస్‌లో శనివారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో కేక్‌ కట్‌ చేసిన ఆయన ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు.

ప్రభుత్వంలో విలీనమైన మొదటి ఏడాదిలో అనేక రకాల అనుభవాలు, అపోహలు, అంతరాలు, అవగాహన లోపాలు కలిగాయని, రాను రాను కార్యకలాపాలు పుంజుకున్న కొద్ది అవి సమసిపోయాయని వివరించారు. కోవిడ్‌ సమయంలో అందరూ పలు రకాల ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతాలు అందించిందని చెప్పారు.

ప్రభుత్వ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో పొందిన వైద్య సేవలకు కూడా మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ స్కీమ్‌కు ఆర్టీసీ ఉద్యోగులను అర్హులుగా చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈడీలు ఎ.కోటేశ్వరరావు (అడ్మినిస్ట్రేషన్‌), పి.కృష్ణమోహన్‌ (ఇంజనీరింగ్‌), కేఎస్‌ బ్రహ్మనందరెడ్డి, ఆదం సాహెబ్, సి.రవికుమార్, విజయవాడ ఆర్‌ఎం ఎంవై దానం తదితరులు మాట్లాడారు.  

మరిన్ని వార్తలు