AP: ఆర్టీసీ బస్సులకు సరికొత్త రూపు 

21 Aug, 2022 04:18 IST|Sakshi

రెండు దశల్లో 2,750 బస్సుల ఆధునికీకరణ 

కొత్త సీట్లు, టైర్లతో పాటు కొత్త రంగులు 

సాంకేతిక సమస్యల పరిష్కారంతో ఆధునికంగా బస్సులు 

తొలి దశ ఆధునికీకరణ దసరాకు పూర్తి

డిసెంబర్‌కు రెండో దశా పూర్తి 

సాక్షి, అమరావతి: ప్రజా రవాణా విభాగం (ఆర్టీసీ) బస్సులు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. దశాబ్ద కాలంగా పాతబడిన బస్సులతో ప్రయాణికులు పడుతున్న పాట్లకు ముగింపు పలకాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ బస్సులను ఆధునికీకరణకు  ప్రణాళిక రూపొందించింది. ఇప్పటికే 650 కొత్త బస్సుల కొనుగోలుతోపాటు 880 అద్దె బస్సులకు ఆర్టీసీ టెండర్లు  పిలిచింది. మరోవైపు ప్రస్తుతం ఉన్న బస్సులకు ఫేస్‌లిఫ్ట్‌ ద్వారా సరికొత్తగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. రెండు దశల్లో 2,750 బస్సులను ఆధునికీకరిస్తారు. దసరా నాటికి మొదటి దశ ఆధునికీకరించిన బస్సులను ప్రారంభించేందుకు సమాయత్తమవుతోంది. 

ఆర్టీసీలో ప్రస్తుతం 11,271 బస్సుల్లో దాదాపు 3,800 బాగా పాతబడ్డాయి. వాటిలో ఏసీ బస్సులు 10 లక్షల కిలోమీటర్లు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు 8 లక్షల కి.మీ., పల్లె వెలుగు బస్సులు 12 లక్షల కి.మీ. పూర్తి చేశాయి. ఆర్టీసీ ఆదాయం సరిపోక, ఉద్యోగుల జీతాలకే అప్పులు చేయాల్సి రావడంతో దశాబ్ద కాలంగా ఆర్టీసీ కొత్త బస్సులు కొనలేదు. ఉన్న వాటికి మరమ్మతులు చేయించలేదు. ఉన్న బస్సుల ఆధునికీకరణా చేపట్టలేదు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 2020 జనవరి నుంచి ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఉద్యోగుల జీతాల కోసం ఏటా రూ.3,600 కోట్లు ప్రభుత్వమే చెల్లిస్తోంది. దాంతో ఆర్టీసీ అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన బస్సు ప్రయాణాన్ని అందించేలా పాలక మండలి కార్యాచరణ చేపట్టింది.  

రెండు దశల్లో ఆధునికీకరణ  
2,750 బస్సులను ఆధునికీకరించాలని ఆర్టీసీ నిర్ణయించింది. కొత్త సీట్లు వేయడం, టైర్లు, హెడ్‌లైట్లు మార్చడం, రంగులు వేయడం, సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తారు. బస్సులకు కొత్త రూపు తెస్తారు. మొదటి దశలో 1,250 పల్లె వెలుగు బస్సులు, 250 సిటీ బస్సుల ఆధునీకరణ చేపట్టారు. ఆర్టీసీ మెకానికల్‌ విభాగం సొంత గ్యారేజీల్లోనే ఈ పనులు చేపట్టింది. ఒక్కో బస్సుకు రూ.2 లక్షల చొప్పున మొత్తం 1,500 బస్సుల ఆధునీకరణకు రూ.30 కోట్లు వెచ్చిస్తున్నారు.

దసరా నాటికి తొలి దశ పూర్తి చేయనున్నారు. రెండో దశలో 1,250 ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను ఆధునికీకరించనున్నారు. వాటిలో ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సెమీ లగ్జరీ సర్వీసులున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రాల మధ్య తిరిగే ఈ సర్వీసులను మరింత వినూత్నంగా ఫేస్‌ లిఫ్ట్‌ డిజైన్‌ను ఆర్టీసీ రూపొందించింది. సీట్లు, టైర్లు, లైట్లు మార్చడంతోపాటు అవసరమైన మేరకు బస్సు బాడీనీ కొత్తగా నిర్మిస్తారు.  డిసెంబర్‌ దీనిని పూర్తి చేయాలని ఆర్టీసీ భావిస్తోంది.   

మరిన్ని వార్తలు