ఏపీఎస్‌ ఆర్టీసీ క్లారిటీ : ప్రతిష్టంభన వీడినట్లేనా!

23 Oct, 2020 16:54 IST|Sakshi

టీఎస్‌ నిర్ణయం కోసం ఎదురుచూపు

సాక్షి, అమరావతి : లాక్‌డౌన్‌ సమయం నాటి నుంచి తెలంగాణ ఆర్టీసీ-ఏపీఎస్‌ ఆర్టీసీ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన వీడినట్లే కనిపిస్తోంది. ఇరు రాష్ట్రల అధికారుల మధ్య ఇప్పటికే పలు విడతలుగా సాగిన భేటీల్లో కీలక అంశాలపై చర్చించగా.. వీటిపై ఏపీఎస్‌ ఆర్టీసీ తుది నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీఎస్‌ ఆర్టీసీ అధికారులు కోరిన ప్రతిపాదనలకు తాము సానుకూలంగా ఉన్నామని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు శుక్రవారం ప్రకటించారు. ఏపీకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నా1.6 లక్షల కిమీలకు తగ్గామని పేర్కొన్నారు. ఏపీఎస్‌ ఆర్టీసీ తాజా నిర్ణయంతో ప్రయాణికులకూ ఇబ్బందులు తప్పవన్నారు. టీఎస్‌ అభ్యంతరాల కారణంగా నష్టం ఉన్నప్పటికీ సర్వీసులను నడపాలనే ఉద్దేశంతో తాము వెనక్కి తగ్గామని కృష్ణబాబు స్పష్టం చేశారు. వాళ్లు కోరినట్లు రూట్‌ వైస్‌ క్లారిటీ కూడా ఇచ్చామని.. ఫైనల్‌ ప్రపోజల్స్‌ కూడా గత వారమే పంపామని తెలిపారు. అయినప్పటికీ టీఎస్‌ ఆర్టీసీ అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వడంలేదని, వారి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా తెలంగాణ పరిధిలో ఏపీ ఆర్టీసీ బస్సులు తిరిగే కి.మీ. 2.64 లక్షలు. తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఏపీ భూభాగంలో తిరిగే కి.మీ. 1.61 లక్షలు మాత్రమే. దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏపీ సర్వీసులను తగ్గించుకోవాలని టీఎస్‌ ఆర్టసీ కోరుతోంది. దీనిపైనే గత రెండు నెలలుగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చులు సాగుతున్నాయి. తాజా ఏపీ లేఖతో సమస్యను వీడినట్లే తెలుస్తోంది. ఈ నెల 21న రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు సమాన కిలోమీటర్ల ప్రాతిపదికన అంగీకారం తెలుపుతూ 1.61 లక్షల కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సులు తిప్పుదామని ప్రతిపాదించింది. దీని మేరకే ఏపీఎస్‌ఆర్టీసీ అంగీకారం తెలుపుతూ లేఖ పంపింది. అయితే దసర పండుగ నేపథ్యంలో తెలంగాణ సైతం వీలైనంత త్వరగా స్పందించే అవకాశం ఉంది. ఇరు యాజమాన్యాల అంగీకారంతో పండగ నాటికి అంతరాష్ట్రాల సర్వీసులు ప్రారంభం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

(దసరా టూర్‌కు ‘ఆర్టీసీల’ బ్రేక్‌!)

ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవా..
దసర పండగ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల నడుమ సర్వీసులు ప్రారంభంకాకపోతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు. తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి తర్వాత ఘనంగా జరుపుకొనే వేడుక. ఈ పండుగ వేళ హైదరాబాద్‌ సహా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న ఏపీ ప్రజలు ఏడెనిమిది లక్షల మంది సొంతూళ్లకు వెళ్తారు. పండుగకు నాలుగైదు రోజుల ముందు నుంచి వారి ప్రయాణాలు మొదలవుతాయి. ఆర్టీసీకి కూడా దసరా సీజన్‌ కలెక్షన్లు కురిపిస్తుంది. పెద్దెత్తున ఆదాయం వస్తుంది. ఈ సమయంలో చార్జీలు అధికారికంగా 50 శాతం పెంచినా ప్రజలు దాన్ని అంతగా పట్టించుకోరు. 

రెండు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసుల ఒప్పందం కుదరకపోవడంతో బస్సులు సరిహద్దులు దాటడం లేదు. రెండు నెలలుగా అధికారులు కుస్తీ పడుతున్నా సయోధ్య కుదరలేదు. మరోవైపు కోవిడ్‌ నిబంధనలతో రైళ్లు కూడా తక్కువ సంఖ్యలోనే నడుస్తున్నాయి. వాటిల్లో రిజర్వేషన్లు దాదాపు పూర్తయ్యాయి. దీంతో విధిలేక ప్రజలు ప్రైవేటు బస్సుల కోసం పరుగుపెట్టాల్సి వస్తోంది. దొరికిందే అదునుగా వారు టికెట్‌ ధరలను అమాంతం పెంచేశారు. ఉదాహరణకు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ఆర్టీసీ చార్జీ రూ.290 ఉంటే.. ప్రైవేట్‌లో రూ.700కు నుంచి 1000 వరకు వసూలు చేస్తున్నారు. వారి దోపిడికి అడ్డుకట్ట వేయాలంటే ఇరు రాష్ట్రాల సర్వీసులు ప్రారంభించక తప్పదు.

మరిన్ని వార్తలు