సీఎం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరడమే నాకు సార్థకత

16 Sep, 2020 18:07 IST|Sakshi

పలు సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిర్దేశించిన 30 నైపుణ్య కళాశాలల ఏర్పాటుతోనే మంత్రిగా తనకు సార్థకత అని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. బుధవారం రోజున టెక్ మహీంద్రా ఫౌండేషన్, బయోకాన్ లిమిటెడ్, స్నైడర్ ఎలక్ట్రిక్ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. మంత్రి మేకపాటి, ఏపీఎస్‌ఎస్‌డీసీ చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విద్య, వైద్య, నైపుణ్య రంగంలో వసతుల కల్పనలో సీఎం రాజీపడరు. మనిషిని మనీషిగా మార్చేది చదువు అని నమ్మిన వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌. ఈ మధ్య తీరిక చేసుకుని జీవితకాల సంతోషమయ జీవితానికి రహస్యం 'ఇకిగయ్‌' అనే జపనీస్‌ పుస్తకం చదివా. ప్రతి పుట్టుకకు కారణం అనేది పుస్తకంలోని అంతరార్థం. ముఖ్యమంత్రి నిర్దేశించిన స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేయడమే నా 'ఇకిగయ్'.  (రాష్ట్రంలో బీహెచ్‌ఈఎల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్సీ)

నైపుణ్యరంగ పోటీలో మన రాష్ట్రం ప్రత్యేకం. సముద్రమంత లక్ష్యంలో నాతో పాటు నావలో ప్రయాణిస్తున్న నైపుణ్యశాఖ అధికారుల కృషి మాటల్లో చెప్పలేనిది. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ అధికారులకు ప్రత్యేక అభినందనలు. విశాఖలో లాజిస్టిక్స్ సెక్టార్‌లో టెక్ మహీంద్రా ఫౌండేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనుంది. లైఫ్ సైన్సెస్ డొమైన్‌లో నాలెడ్జ్ పార్టనర్‌గా బయోకాన్ వ్యవహరించనుంది. 12 స్కిల్ కాలేజీల్లో ఆటోమేషన్ అండ్ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌ సెక్టార్‌లో స్కిల్ సెంటర్ల ఏర్పాటుకు స్నైడర్ ఎలక్ట్రిక్ అంగీకారం తెలిపింది' అని మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఎంవోయూ కార్యక్రమానికి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. అనంతరాము, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్, ఐ.టీ శాఖ సలహాదారు విద్యాసాగర్ రెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ స్పెషల్ కమిషనర్ ఎంఎం నాయక్, సీడాప్ సీఈవో ఎం మహేశ్వర్‌రెడ్డి, న్యాక్ అడిషనల్ డీజీ కెవి నాగరాజ, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు వి. హనుమనాయక్, డాక్టర్ బి. నాగేశ్వరరావు, ప్రొఫెసర్‌ డి.వి. రామకోటిరెడ్డితో పాటు పలువురు సిబ్బంది పాల్గొన్నారు. (కైనటిక్‌ గ్రీన్‌‌ ప్రతినిధులతో మేకపాటి భేటీ)

మరిన్ని వార్తలు