అవినీతికి ‘సీమెన్స్‌’ ముసుగు

13 Dec, 2021 07:33 IST|Sakshi

 నిధులు కొల్లగొట్టడానికే ఆ కంపెనీ పేరు 

షెల్‌ కంపెనీల ద్వారా నిధుల దోపిడీ

ఈ విషయాన్ని అప్పట్లోనే నిగ్గు తేల్చిన సీమెన్స్‌ యాజమాన్యం

సమాచారం ఇచ్చినా స్పందించని టీడీపీ ప్రభుత్వం

ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంలో కొత్త కోణం

సాక్షి, అమరావతి : యువతకు ఉపాధి శిక్షణ ముసుగులో గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎస్‌డీసీ)లో నిధులు కొల్లగొట్టిన వైనం అంతర్జాతీయ స్థాయి కార్పొరేట్‌ సంస్థలను కూడా విభ్రాంతికి గురి చేసింది. ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సంస్థల పేర్లను కూడా వాడుకుని టీడీపీ ప్రభుత్వ పెద్దలు ప్రజాధనాన్ని దోచుకున్నారని వెల్లడైంది. టీడీపీ ప్రభుత్వ పెద్దలు వారి స్వార్థం కోసం తమ సంస్థ పేరును దుర్వినియోగం చేసిందని ప్రముఖ కంపెనీ సీమెన్స్‌ అంతర్గత విచారణలో నిగ్గు తేల్చడం గమనార్హం.

 చదవండి: దోపిడీలో స్కిల్‌.. బాబు గ్యాంగ్‌ హల్‌'షెల్‌'

ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంలో సీఐడీ అధికారుల దర్యాప్తులో తాజాగా ఈ విషయం వెలుగు చూసింది. యువతకు ఉపాధి శిక్షణ కోసం జర్మనీకి చెందిన సీమెన్స్‌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నామని చంద్రబాబు ప్రభుత్వం ఆనాడు ఘనంగా చెప్పుకుంది. కానీ వాస్తవం ఏమిటంటే.. భారతదేశంలో సీమెన్స్‌ సంస్థకు అప్పట్లో ఎండీగా ఉన్న సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ అలియాస్‌ సుమన్‌ బోస్‌ను అడ్డం పెట్టుకుని టీడీపీ పెద్దలు కుట్రకు తెరతీశారు. దాంతో పేరుకు సీమెన్స్, డిజైన్‌ టెక్‌ సంస్థలతో కలిసి ఏపీఎస్‌ఎస్‌డీసీ రూ.3,556 కోట్లకు త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నట్టు చూపించారు. కానీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌తో కలిసి అందుకోసం పీవీఎస్‌పీ ఐటీ స్కిల్స్, స్కిల్లర్‌ అనే షెల్‌ కంపెనీలను సృష్టించారు.

ఏపీఎస్‌ఎస్‌డీసీ కాంట్రాక్టును ఆ సంస్థలకు సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చినట్టు కథ నడిపించారు. అనంతరం సీమెన్స్, డిజైన్‌ టెక్‌ సమకూర్చాల్సిన 90 శాతం నిధులను సమకూర్చకుండానే.. ప్రభుత్వం తమ వాటా 10 శాతం పన్నులతో సహా రూ.371 కోట్లు చెల్లించేసింది. దాంతో ఏసీఐ అనే మరో కంపెనీ నకిలీ ఇన్‌వాయిస్‌లతో రూ.241 కోట్లను దొడ్డి దారిలో డిజైన్‌ టెక్‌ సంస్థకు చేరవేసింది. ఈ మొత్తం వ్యవహారంలో సీమెన్స్‌ సంస్థ అధికారిక ప్రమేయం లేదు. కానీ సీమెన్స్‌ తరఫున కథ నడిపినట్టుగా ఆ సంస్థ ఎండీ సౌమ్యాద్రిబోస్‌ తతంగం నడిపారు. ఈ విధంగా ఇటు ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే కాకుండా అటు తమ సీమెన్స్‌ సంస్థనూ మోసం చేశారు.

సంతకంలోనూ మతలబే
ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకే కాంట్రాక్టు కుదుర్చుకున్న టీడీపీ ప్రభుత్వ పెద్దలు, సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ అందుకు పక్కాగా పన్నాగం పన్నారు. ఏపీఎస్‌ఎస్‌డీసీతో ఒప్పందంలో సౌమ్యాద్రి బోస్‌ తన పేరును రాహుల్‌ బోస్‌గా సంతకం చేశారు. అలియాస్‌గా పేరు ఏదైనా ఉండొచ్చు. అధికారిక పత్రాలపై తన అసలు పేరుతోనే సంతకం చేయాలి. 
కానీ అందుకు విరుద్ధంగా ఆయన రాహుల్‌ బోస్‌ పేరుతో సంతకం చేయడం గమనార్హం. అయితే గుజరాత్‌ ప్రభుత్వంతో సీమెన్స్‌ సంస్థ ఒప్పందం చేసుకున్న పత్రాలపై మాత్రం తన అధికారిక పేరు సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ అనే సంతకం చేశారు. కానీ ఏపీలో కేవలం నిధులు కొల్లగొట్టడానికే అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల చేతుల్లో పావుగా మారి తన అధికారిక పేరు కాకుండా అలియాస్‌ పేరుతో సంతకం చేశారు.

అవినీతి బాగోతంపై సీమెన్స్‌ దర్యాప్తు
2018లో కేంద్ర జీఎస్టీ అధికారుల తనిఖీల్లో నకిలీ ఇన్‌వాయిస్‌ వ్యవహారం బయటపడింది. దాంతో ఆ విషయాన్ని సీమెన్స్‌ సంస్థ యాజమాన్యానికి జీఎస్టీ అధికారులు తెలిపారు. దాంతో సీమెన్స్‌ కంపెనీ యాజమాన్యం ఈ వ్యవహారంపై అంతర్గతంగా దర్యాప్తు నిర్వహించింది. సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ ఈ విషయం తెలుసుకుని ఏపీఎస్‌ఎస్‌డీసీతో సాగించిన లావాదేవీలకు సంబంధించిన ఈ మెయిల్స్, ఇతర రికార్డులను తమ కంప్యూటర్లలో డిలీట్‌ చేశారు. కానీ జర్మనీలోని సీమెన్స్‌ కంపెనీ యాజమాన్యం అత్యున్నత సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిలీట్‌ చేసిన ఈ మెయిల్స్, ఇతర ఫైళ్లను వెలికి తీసింది. దాంతో ఏపీఎస్‌ఎస్‌డీసీతో ఒప్పందం పేరుతో అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టిన విషయం నిర్ధారణ అయ్యింది. తమ తప్పు రుజువు కావడంతో సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌తోపాటు ఆయన సన్నిహితులు సీమెన్స్‌ కంపెనీకి రాజీనామా చేశారు. ఆ విషయాన్ని సీమెన్స్‌ కంపెనీ యాజమాన్యం అప్పటి టీడీపీ ప్రభుత్వానికి తెలిపినప్పటికీ ఏ మాత్రం స్పందించ లేదు.

మరిన్ని వార్తలు