శ్రీవారి సేవలో ఏపీటీడీసీ! 

7 Feb, 2023 04:17 IST|Sakshi

తిరుమలకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం 

టీటీడీ కోటా టికెట్లు పొందే వివిధ రాష్ట్రాల పర్యాటక సంస్థలకు బ్యాకెండ్‌ సేవలు 

ప్రతి 25 మంది భక్తులకు ఒక గైడ్‌ ఏర్పాటు 

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా తిరుమల వెంకన్న దర్శనంలో భక్తులకు ప్రత్యే­క సేవలందించనుంది. ఏపీఎస్‌ ఆర్టీసీతో పాటు ఇతర రాష్ట్రాల పర్యాటకాభివృద్ధి సంస్థలు, ఐఆర్‌సీటీసీల ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి బ్యాకెండ్‌ సౌకర్యాలు కల్పించనుంది. భక్తులు గంటల కొద్దీ నిరీక్షణ, కంపార్టుమెంట్లలో వేచి చూసే ఇబ్బందులు లేకుండా వెంకన్నను దర్శించుకోవడంలో కీలక పాత్ర పోషించనుంది.

ప్రతి నెలా ఆయా కార్పొరేషన్లకు టీటీడీ స్పెషల్‌ కోటా టికె­ట్లను విడుదల చేస్తోంది. ఇందులో చాలా సంస్థలు భక్తులకు టికెట్ల విక్రయంతోనే చేతులు దులుపుకుంటున్నా­యి. దీంతో తిరుపతి చేరుకున్న భక్తులు కొండపైకి వెళ్లడానికి, బసకు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కొన్నిసార్లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో దోపిడీకి గురవుతున్నారు. దీనిని అరికట్టేందుకు టీటీడీ.. ఏపీటీడీసీ (ఆంధ్రప్రదేశ్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) సేవలను అందుబాటులోకి తెస్తోంది. 

గైడ్‌ సాయంతో దర్శనం.. 
ఏపీటీడీసీ తిరుమల స్వామి దర్శనానికి ప్యాకేజీ టూర్లను నిర్వహిస్తోంది. సొంత బస్సులతో పాటు ఏజెంట్ల ద్వారా చెన్నై, బెంగళూరు, కుంభకోణం, ఉడిపి, బళ్లారి, హైదరాబాద్‌ నుంచి తిరుమలకు టూర్లు నడుపుతోంది. పూర్తి రవాణా సౌకర్యంతో పాటు ప్రతి 25 మంది భక్తులకు ఒక గైడ్‌ సాయంతో దగ్గరుండి దర్శనం చేయిస్తోంది. తిరుపతి నుంచి తిరుమలకు ప్రత్యేక బస్సుల్లో ప్రయాణికులను తరలించి వసతి, ఆతి­థ్యం కల్పిస్తోంది.

ఇదే విధానాన్ని అన్ని కార్పొరేషన్లు కచ్చితంగా అమలు చేయాలని టీటీడీ ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే బ్యాకెండ్‌ సేవల బాధ్యతలను ఏపీటీడీసీకి అప్పగించింది. త్వరలోనే టీటీడీ టికెట్లు పొందే కార్పొరేషన్లు ఏపీటీడీసీతో ఒప్పందం చేసుకోనున్నాయి. దీంతో భక్తులకు మెరుగైన సేవలు అందడంతో పాటు ఏపీటీడీసీకి ఆదరణ పెరగనుంది. సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన విశాఖ–తిరుపతి, విజయవాడ–తిరుపతి ప్యాకేజీలను ఏపీటీడీసీ త్వరలో పునరుద్ధరించనుంది.

టికెట్లు విడుదల ఇలా.. 
టీటీడీ స్పెషల్‌ కోటా కింద ప్రతి నెలా పది కార్పొరేషన్లకు సుమారు 5,400 టికెట్లను విడుదల చేస్తోంది. ఇందులో దాదాపు 80 శాతం ఆక్యుపెన్సీ రేటు ఉంటోంది. శని, ఆదివారాల్లో అయితే 90శాతం పైగా టికె­ట్లు బుక్‌ అవుతున్నాయి. ఏపీటీడీసీ, ఆర్టీసీకి వెయ్యి చొప్పున, టీఎస్‌ఆర్టీసీకి వెయ్యి, టీఎస్‌టీడీసీకి 350, ఐఆర్‌సీటీసీకి 250, తమిళనాడు పర్యాటకాభివృద్ధి సంస్థకు వెయ్యి, కర్ణాటకకు 500, గోవా, పాండిచ్చేరి, ఇండియన్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లకు 100 చొప్పున టికెట్లు కేటాయిస్తోంది.

త్వరలో ఈ టికెట్లను ఒకే వేదికగా ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయనుంది. తద్వారా ఒకచోట టికెట్లు లేకుంటే మరో సంస్థ కోటా నుంచి టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. మరోవైపు తిరుమల కొండపై ఏపీటీడీసీకి ప్రత్యేక గదులను సైతం టీటీడీ కేటాయించనుంది.

సులభ దర్శనం.. 
ఇకపై తిరుమల స్వామి దర్శనంలో ఏపీటీడీసీ కీలకంగా మారనుంది. మేము అమలు చేస్తున్న దర్శన విధానం మెరుగైన ఫలితాలు ఇస్తోంది. మా దగ్గర టికెట్‌ బుక్‌ చేసుకున్న భక్తులు ఎక్కడా ఇబ్బంది పడకుండా దర్శనం చేసుకుంటున్నారు.

అందుకే ఏపీటీడీసీ బ్యాకెండ్‌ సేవలకు ఒప్పుకుంటేనే టికెట్‌లు విడుదల చేస్తామని టీటీడీ ఇతర రాష్ట్రాల కార్పొరేషన్లకు తేల్చిచెప్పింది. ఒప్పందాలు పూర్తయితే ఐఆర్‌సీటీసీ, ఇతర కార్పొరేషన్ల ద్వారా వచ్చే భక్తులు నేరుగా మేము తిరుపతిలో రిసీవ్‌ చేసుకుని.. దర్శనం చేయించి పంపిస్తాం.  
– కె.కన్నబాబు, ఎండీ, పర్యాటకాభివృద్ధి సంస్థ   

మరిన్ని వార్తలు